‘కాళేశ్వరం’ కొత్తదే! | Kaleshwaram project will considered as new one, CWC told Telangana | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ కొత్తదే!

Published Sun, Mar 26 2017 2:56 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

‘కాళేశ్వరం’ కొత్తదే! - Sakshi

‘కాళేశ్వరం’ కొత్తదే!

తేల్చిచెప్పిన కేంద్ర జల సంఘం?
- పాత ప్రాజెక్టేనన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన బుట్టదాఖలు
- ప్రాజెక్టు స్వరూపం పూర్తిగా మారిందని స్పష్టీకరణ
- నీటి పరిమాణం, ఆయకట్టు, రిజర్వాయర్ల సామర్థ్యం, వ్యయ అంచనాల్లో భారీ తేడాలున్నాయని వివరణ
- మార్గదర్శకాల ప్రకారం నూతన ప్రాజెక్టుగానే పరిగణిస్తామని వెల్లడి.. గోదావరి బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శికి చేరిన సమావేశ మినిట్స్‌ కాపీ
- రేపు రాష్ట్రానికి అందే అవకాశం
- అభ్యంతరాలను పరిశీలించాకే స్పందించనున్న ప్రభుత్వం  


సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నీళ్లు జల్లింది. ఇది ముమ్మాటికీ పాత ప్రాజెక్టేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదించినా పట్టించుకోని సీడబ్ల్యూసీ... కాళేశ్వరం కొత్త ప్రాజెక్టేనని తేల్చిచెప్పింది. నీటిని తీసుకునే నదీ బేసిన్‌ ప్రాంతం, బ్యారేజీ నిర్మాణ స్థలం పూర్తిగా మారి ప్రాజెక్టు స్వరూపం (స్కోప్‌ ఆఫ్‌ వర్క్‌) మారినందున దీన్ని కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఈ నెల 20న ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) అనుమతులకు సంబంధించి ఢిల్లీలో జరిగిన సమావేశపు మినిట్స్‌ కాపీని సీడబ్ల్యూసీ...గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌ హెచ్‌కే హల్దార్, సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీలకు పంపినట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. ఈ మినిట్స్‌ కాపీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది.

సీడబ్ల్యూసీ సూచన మేరకే రీ డిజైన్‌ చేసినా...
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి పర్యావరణ మదింపు చేసుకునేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల తీవ్ర అభ్యంతరాలు చెబుతూనే ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై ముందుగా సీడబ్ల్యూసీ అధ్యయనం చేయాల్సి ఉందని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీ ఎదుట అభ్యంతరం తెలపగా ఈ నెల 20న రాష్ట్ర అధికారులు, గోదావరి బోర్డుతో కలసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని, ముమ్మాటికీ పాత ప్రాజెక్టేనని తెలంగాణ తేల్చిచెప్పింది. గతంలో సీడబ్ల్యూసీ చేసిన సూచనలు, సలహాల మేరకే పాత ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్‌ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టామని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ సభ్యుడు ప్రదీప్‌ కుమార్‌జైన్‌ అనేక అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రాణహిత–చేవెళ్ల డీపీఆర్‌ను తమకు ఇవ్వలేదని, దానికి సూత్రప్రాయ అంగీకారం లేదని పేర్కొన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన తెలంగాణ... 2009లోనే ప్రాణహిత–చేవెళ్లకు సీడబ్ల్యూసీ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని, 2010లో ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించామని, ఆ తర్వాత వివిధ డైరెక్టరేట్‌ల నుంచి అనుమతులు సైతం వచ్చాయని పేర్కొంటూ నివేదికలను సమర్పించింది.

అలాగే తమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని తెలుపుతూ 2015 మార్చి 4న సీడబ్ల్యూసీ రాష్ట్రానికి రాసిన లేఖతోపాటు పాత ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో జలాశయాల సామర్థ్యం కేవలం 16.43 టీఎంసీలే ఉన్నందున వాటిని పెంచుకోవాలంటూ 2008 జూలై 22న సీడబ్ల్యూసీ రాసిన మరో లేఖను సైతం సమర్పించింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న అంతర్రాష్ట్ర అంశాలనూ కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఇవేమీ పట్టని సీడబ్ల్యూసీ... ప్రాజెక్టు స్వరూపం పూర్తిగా మారినందన తమ మార్గదర్శకాల ప్రకారం దీన్ని కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తామని పేర్కొన్నట్లుగా గోదావరి బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. తమ్మిడిహెట్టి వద్ద నీటి పరిమాణం, మేడిగడ్డ వద్ద నీటి పరిమాణంలో అంతరాలు, ఆయకట్టులో జరిగిన మార్పులు, వ్యయ అంచనాల్లో భారీ తేడాలు, రిజర్వాయర్ల సామర్థ్యాల్లో మార్పులను అంశాలవారీగా వివరిస్తూ దీన్ని కొత్త ప్రాజెక్టుగా పేర్కొన్నట్లుగా తెలిసింది. అయితే ఈ మినిట్స్‌ కాపీ కేవలం చైర్మన్, సభ్య కార్యదర్శికి మాత్రమే చేరడం, వారు ఢిల్లీలో ఉండటంతో అందులోని పూర్తి వివరాలు బయటకు రాలేదు. విషయం తెలిసిన వెంటనే మినిట్స్‌ కాపీ కోసం రాష్ట్ర అధికారులు ప్రయత్నించినా లభించలేదు. సోమవారం ఈ కాపీ అందే అవకాశం ఉంది. అది అందాక అందులో సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించాకే తదుపరి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement