సాక్షి, వరంగల్: కాళోజి హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో గందరగోళం చోటుచేసుకుంది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల రాసిన పరీక్షను రద్దు చేశారు. టెక్నికల్ కారణాల వల్ల పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే. సోమవారం నుంచి యూనివర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే నేడు ఉదయం విద్యార్థులు ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహించారు. తీరా ఎగ్జామ్ పూర్తయిన కొద్దిసేపటికి పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ నుంచి విద్యార్థుల ఫోన్లకు అధికారులు సందేశాలు పంపించారు. మరోసారి షెడ్యూల్ ఖరారు చేసి పరీక్ష నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు ఆ సందేశంలో పేర్కొన్నారు.
పరీక్ష జరిగిన రెండు సెంటర్లలో ఒక కోడ్‌కు బదులు.. మరో కోడ్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసి పరీక్ష నిర్వహించనందువల్ల.. పరీక్ష రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రాసిన పరీక్ష రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటు అధికారులు ప్రకటించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ పరీక్షలంటే ఇంత నిర్లక్ష్యమా అని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది తీరును తప్పుబట్టిన విద్యార్థులు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment