తెలంగాణలో బీజేపీకి అది పగటి కల!
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి అధికారంలోకి రావడం పగటికల మాత్రమేనని, టు-లెట్ బోర్డు పెట్టుకుని ఎదురుచూస్తున్నా బీజేపీలో ఎవరూ చేరరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఙానానికి నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలంలో మంగళవారం కర్నె విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుందో కూడా తెలియకుండా అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీకి చెందిన రాంమాధవ్ ఆ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయకుండా తెలంగాణలో అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే వారి వ్యాఖ్యలను రాంమాధవ్ వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్‌కు కితాబిచ్చారన్నారు. తమ పార్టీలో సమర్థులు లేరని, ఇతరులు బీజేపీలోకి రావాలని రాంమాధవ్ చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు.
బీజేపీలో చేరడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ రెండు సంక్షేమ పథకాలు చెప్పగలరా అని నిలదీశారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన రాంమాధవ్ అదే ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేసిన దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం చేసిన ప్రత్యేక సాయం ఏమీ లేదని, అలాంటప్పుడు తెలంగాణ బీజేపీని ఎందుకు ఆదరిస్తుందని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను సొంతంగానే పూర్తి చేస్తున్నామని, తెలంగాణలో కాషాయ జెండా ఎగిరే ప్రసక్తే లేదని అన్నారు.