తెలంగాణ రాష్ట్రంపై, ఇక్కడి రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై, ఇక్కడి రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు ప్రపంచంలో ఎవరూ చేయని అభివృద్ధిని తానే చేసినట్లు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్‌రెడ్డి, మరో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లతో క లసి విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం దండగ అన్న పెద్దమనిషి, ఇపుడు రైతుల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని కర్నె వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణలో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు, మంద కృష్ణ మాదిగ చీకటి ఒప్పందాలు చేసుకున్నారా అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.