చంద్రబాబూ! చరిత్రలో లేకుండా పోతావ్: కవిత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు ఎక్కడా చోటు కల్పించకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని, వీరోచిత తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెడితే, చరిత్రలో లేకుండా పోతారని నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు, పలువురు కార్యకర్తలు ఆ పార్టీలను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై అనేకమంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదుకు స్పందన బాగుందని, సినీ హీరో ఆకాశ్ కూడా పార్టీలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పద్మారావుగౌడ్, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.