
సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కేసీఆర్
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవ హరించే కీలకమైన సదరన్ జోనల్ కౌన్సిల్(దక్షిణ ప్రాంతీయ మండలి) వైస్ చైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది కాలం పాటు కేసీఆర్ ఈ పదవిలో కొనసాగుతారు. దీనికి కేంద్ర హోం మంత్రి చైర్మన్‌గా ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం, సత్సంబంధాలు నెలకొల్పడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఈ కౌన్సిల్‌లో సభ్య రాష్ట్రాలుగా ఉండగా.. ఇటీవ లే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇందులో చేర్చారు.
తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదే ఈ కౌన్సిల్‌కు వైస్ చైర్మన్‌గా కేసీఆర్ నియమితులవడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా కేసీఆర్‌కు రెండు, మూడు రోజుల కిందట లేఖ రాశారు. కౌన్సిల్ మరింత ప్రభావవంతంగా, నిర్మాణాత్మకంగా పనిచేసేలా కృషి చేస్తారని అభిలషిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. జాతీయ సమగ్రతను మరింత పటిష్టపరచడం, అభివృధ్థి ప్రాజెక్టులను వేగవంతంగా, సమర్థంగా నిర్వహించే వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అభివృద్ధి అంశాలపై రాష్ట్రాల ఆలోచనలు, అనుభవాలను ఎప్పటికప్పుడు కేంద్రంతో పంచుకోవడం వంటి విషయాల్లో ఈ మండలి క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుంది.