- 25 నుంచి 30 ఇళ్లను ఒక సెక్టార్‌గా చేయాలి
- అధికారులు నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా..
- దళితుల భూ పంపిణీ ఏర్పాట్లు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శరత్
సిద్దిపేట రూరల్ : తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే ఈ నెల 19న పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని ఆయా శాఖల అధికారులచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు అంశాలను సూచించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 25 నుంచి 30 ఇళ్లను గ్రూపులుగా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌ను నియమించాలన్నారు. ఎన్యూమరేటర్లుగా పని చేయడానికి పోలీస్ సిబ్బందితో పాటు ఇతర అన్ని శాఖల అధికారులు ఇందులో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని పర్యవేక్షణ బాధ్యత తహశీల్దార్లదేన్నారు.
ఈ కార్యక్రమం 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిచేయాలన్నారు. ఇంటింటి సర్వేలో కుటుంబ సభ్యుల వాస్తవ పరిస్థితులకు మాత్రమే తెలియజేయాలన్నారు. ఆ ఒక్క రోజు ఏ అధికారి విధులకు హాజరుకాకపోయినా, సర్వేలో నిర్లక్ష్యం వహించినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే దళితుల భూ పంపిణీ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 9 గ్రామాల ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో 5 గ్రామాల్లో దళితులందరికీ భూములున్నట్లు గుర్తించామన్నారు.
మరో నాలుగు గ్రామాల్లో పూర్తి స్థాయిలో భూములేవని వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల సక్రమంగా గుర్తించాలని, గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పత్రికల్లో వచ్చినట్లయితే తహశీల్దార్, ఆర్‌ఐతో పాటు సంబంధిత అధికారులను సైతం సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. మొదటి దశలో కుటుంబానికి ఎలాంటి భూమిలేని వారిని గుర్తించి పంపిణీ చేస్తారని, రెండో దశలో కుటుంబానికి మూడు ఎకరాలకు తక్కువగా భూమి ఉన్న వారిని పంపిణీ చేస్తామని తెలిపారు. వీటికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎలాంటి ఆటంకాలు లేకుంటే ఆగస్టు 15న పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీఓ బాల్‌రాజు, తహశీల్దార్ ఎన్‌వై గిరితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
19 నుంచి పకడ్బందీగా ఇంటింటి సర్వే
Published Sun, Aug 3 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement