సాక్షి, హైదరాబాద్: ‘విద్యార్థులు లేకున్నా కూసుండబెట్టి టీచర్లకు జీతాలు ఇవ్వాలా? తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లను దగ్గర్లోని స్కూలులో కలిపి, నాణ్యమైన విద్యను ఇస్తామంటే అనవసరంగా వివాదం చేస్తున్నరు?..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏదైమైనా దీనిని త్వరలోనే సరిదిద్దుతామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశం అనంతరం... మీడియా వెళ్లిపోయాక పలువురు నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని కేసీఆర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ప్రభుత్వంలో ఉన్నవారు పట్టించుకోవడం లేదని కొందరు ఇన్‌చార్జులు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ‘‘నేను కూడా వీలైనన్ని సార్లు పార్టీ కార్యాలయానికి వస్తా. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యాలయానికి రావాలి.
పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల సమస్యలను పరిష్కరించాలి. పార్టీ పునాదులు, కార్యకర్తల శ్రమతోనే పదవులు వచ్చాయని అందరూ గుర్తు పెట్టుకోవాలి..’’ అని పార్టీ నేతలకు సూచించారు. మరికొందరు రుణమాఫీ, విద్యుత్ కొరత, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ గురించి ప్రశ్నించగా.. ‘‘రేషనలైజేషన్‌ను కొందరు వివాదం చేస్తున్నరు. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు లేకున్నా టీచర్లకు జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. విద్యార్థులున్న స్కూళ్లలో టీచర్లు లేరు. తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లను దగ్గర్లోని స్కూలులో కలిపి.. నాణ్యమైన విద్యను ఇస్తామంటే ఎందుకు వివాదం చేస్తున్నరు? విద్యార్థులు లేకున్నా, పనిచేయకున్నా ఎంత టీచర్లు అయినా కూసుండబెట్టి జీతాలు ఇయ్యాలంటే ఎట్లా? ఏదేమైనా దీనిని త్వరలోనే పరిష్కరిస్తం..’’ అని కేసీఆర్ సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది.
ముందు అభివృద్ధి.. తర్వాతే ఎన్నికలు!
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా నేతలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టుకుందామన్నారు. ఇందుకు ఒక ఏడాది పట్టవచ్చన్నారు. అనంతరం గ్రేటర్ ఎన్నికలపై చర్చించడానికి మంత్రులు కె.తారకరామారావు, పి.మహేందర్‌రెడ్డి, టి.పద్మారావులు గ్రేటర్ పార్టీ నేతలతో విడిగా సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరిన, చేరడానికి ముందుకు వస్తున్న వివిధ పార్టీల నేతల గురించి ఈ సందర్భంగా చర్చించారు. కొత్తగా వచ్చిన నేతలకు పార్టీ టికెట్లు ఇస్తే పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్నవారి సంగతి ఏమిటని మంత్రులతో పార్టీ నేతలు గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది.
కూర్చోబెట్టి.. జీతాలివ్వాలా?
Published Mon, Oct 6 2014 1:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement