
ఆ ఇద్దరికీ..!
కేసీఆర్ కేబినెట్‌లో జూపల్లి, లక్ష్మారెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గంలో జిల్లాకు పెద్దపీట వేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు కేబినెట్‌లో చోటు కల్పించారు. వీరిద్దరు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారం రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్ష్మారెడ్డికి విద్యుత్, జూపల్లికి పరిశ్రమల శాఖలు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు ప్రధానశాఖలు దక్కడం వెనుకబడిన పాలమూరు అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది.
నూతన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కావస్తున్నా మంత్రి వర్గంలో జిల్లాకు చోటుదక్కకపోవడంతో అధికారపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. మరోవైపు మంత్రివర్గంలో చోటుకోసం టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తూ వచ్చారు. సామాజికవర్గాల సమీకరణాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస గౌడ్‌కు మంత్రివర్గ విస్తరణకు ముందే పార్లమెంటరీ కార్యదర్శి హోదా కట్టబెట్టారు. పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్‌రెడ్డికి ప్రణాళిసంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. దీంతో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవులు దక్కడం ఖాయమని విస్తరణ ప్రక్రియకు ముందే స్పష్టత వచ్చింది.
విపక్షాలపై పైచేయి సాధించేందుకే!
2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2004లో లక్ష్మారెడ్డి ఒక్కరే జడ్చర్ల నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీచేసి గెలుపొందినా ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా సాధించలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన నేపథ్యంలో ఓ ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుపొందడంతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. జిల్లాకు చెందిన విపక్షనేతలు డీకే అరుణ, చిన్నారెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరుల దూకుడుకు కళ్లెం వేస్తూ.. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం కల్పించినట్లు స్పష్టమవుతోంది.