ఒక్క అర్హుడ్ని కూడా వదలం... : కేసీఆర్
మహబూబ్నగర్ : అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆసరా' పథకాన్ని శనివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందన్నారు. అర్హులైనవారికి పింఛన్లు రాకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. 'ఒక్క అర్హుడ్ని కూడా వదలం...ఒక్క అనర్హుడ్ని రానీవ్వం' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వాలు పెన్షన్లపై తమాషా చేశాయని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. 30ఏళ్ల వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు ఇచ్చారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో అనర్హులకు ఇచ్చిన పింఛన్లు రద్దు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇకపై రేషన్ కార్డుపై రూపాయికి కిలో చొప్పున మనిషికి ఆరుకిలోలు బియ్యం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అర్హులైనవారి రేషన్ కార్డులు తొలగించే ప్రసక్తే లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తామని కేసీఆర్ తెలిపారు. గ్రామీణ రోడ్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.