మీ చెమట చుక్కలే.. ప్రజలకు నీటి చుక్కలు
‘వాటర్‌గ్రిడ్’పై అధికారులతో సీఎం కేసీఆర్
17 ఏళ్లకిందే సిద్దిపేటలో చేయగలిగింది.. ఇప్పుడు చేయలేమా?... రేయింబవళ్లు కష్టపడైనా ప్రాజెక్టును విజయవంతం చేయాలి
‘వాటర్‌గ్రిడ్’ను దేశానికే ఆదర్శంగా నిలుపుదామని పిలుపు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/హైదరాబాద్: ‘‘అందరూ అసాధ్యమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసుకున్నం. అలాగే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుదాం. ఇందుకు ప్రతి అధికారి అర్జునుడిగా మారాలి. అధికారులంతా చెమట చుక్కలు రాలిస్తేనే.. ప్రజలకు కాసిన్ని మంచినీటి చుక్కలు అందుతాయి..’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు 1997లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమగ్ర మంచినీటి పథకమే మూలమని సీఎం చెప్పారు. బుధవారం సిద్దిపేటకు వచ్చిన రాష్ట్ర మంత్రులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ అవగాహన కల్పించారు. సిద్దిపేటలో నీటి ప్రాజెక్టు పనులను 16 నెలల్లో పూర్తి చేయడంలో తాము అనుసరించిన పద్ధతులను సీఎం వివరించారు.
185 గ్రామాలకు నిరంతర సరఫరా..
సిద్దిపేటలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తనతో పాటు ఇంజనీర్లు ఎంతో శ్రమించి మంచినీటి ప్రాజెక్టును పూర్తి చేశామని కేసీఆర్ చెప్పారు. అందులో 90 శాతం తన ప్రణాళిక (డిజై న్)తోనే జరిగిందని, ఇందుకోసం తాను 37 సార్లు లోయర్ మానేరు డ్యామ్‌ను సందర్శించానని తెలిపారు. సిద్దిపేట నుంచి 145 గ్రామాలకు నీటి సరఫరాకు రూపకల్పన చేయగా.. ప్రస్తుతం 185 గ్రామాలకు నీరందుతోందని సీఎం చెప్పారు. ‘‘రెండు దశాబ్దాలనాడు సిద్దిపేటలో అప్పటి ఇంజనీర్లు చేయగా లేనిది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రమంతటా నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయలేమా..?’’ అని అధికారులతో సీఎం వ్యాఖ్యానించారు. ‘మినిమం డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్)’ నుంచి ప్రతి నీటిబొట్టును గుట్టమీదకి చేర్చి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా పరిసర గ్రామాలకు నీరందించడమే వాటర్‌గ్రిడ్ లక్ష్యమన్నారు. అన్ని జిల్లాలో ఇంజనీర్లు తమ జిల్లాలోని కాంటూర్లపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆయా జిల్లాల్లో కాంటూర్ల వివరాలతో ప్రభుత్వం రూపొందించిన పుస్తకం ప్రతి ఇంజనీర్ జేబులో ఉండాలని స్పష్టం చేశారు.
సదుపాయాలు కల్పిస్తాం..
వాట ర్‌గ్రిడ్ బాధ్యతలను తీసుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బందికి ఐపాడ్లు, ల్యాప్‌ట్యాప్‌లు తదితర అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంట్రాక్టర్లకు కూడా అడ్వాన్సులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అధికారుల కాలికి ముల్లుగుచ్చుకుంటే.. పంటితో పీకేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... రాత్రింబవళ్లు కష్టపడైనా సరే ప్రాజెక్టును విజయవంతం చేయాల్సిన బాధ్యత వారిదేనని సీఎం పేర్కొన్నారు.
మంత్రులకు అవగాహన కల్పించిన సీఎం
బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు కరీంనగర్‌లోని మానేర్ డ్యాంను సందర్శించారు. అక్కడ నీరు తోడే పద్ధతి, 395 మీటర్ల ఎత్తులో ఉన్న మైలారం గుట్టపైకి లిఫ్టు చేసే విధానాన్ని చూపించారు. అనంతరం సిద్దిపేట ఫిల్టర్‌బెడ్‌లో శుద్ధి అయిన నీరు సమీప గ్రామాలకు సరఫరా అవుతున్న తీరును చూపారు. సిద్దిపేటలో రూ.4.8 కోట్లతో కోమటి చెరువు ఆధునీకరణ పనులకు, రూ. 2 కోట్లతో టూరిజం శాఖ చేపట్టిన సుందరీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కాగా వాటర్‌గ్రిడ్ బాధ్యతలను నిర్వహించే ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే ఉన్నా.. ఆయన ఈ కార్యక్రమాలకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే కొద్దిపాటి అస్వస్థత కారణంగా కేటీఆర్ రాలేకపోయారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.