ఆర్టీసీ బస్సులను మూడు రకాలుగా విభజిస్తాం : కేసీఆర్‌ | KCR Says We Will Divide TSRTC Into Three Ways | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులను మూడు రకాలుగా విభజిస్తాం : కేసీఆర్‌

Published Mon, Oct 7 2019 9:34 PM | Last Updated on Tue, Oct 8 2019 9:28 PM

KCR Says We Will Divide TSRTC Into Three Ways - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం లేదని వెల్లడించారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అందుకు అనుగుణంగానే ఆర్టీసీని పట్టిష్టం చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలని అన్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను మూడు రకాలుగా విభజించనున్నట్టు ప్రకటించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి పలు ప్రతిపాదనలు తయారుచేసి సీఎంకు అందజేసింది. కమిటీ అందజేసిన నివేదికపై కేసీఆర్‌ దాదాపు నాలుగు గంటల పాటు సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్కే జోషితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక అంశాలపై వారితో చర్చించారు.

‘ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 10,400 బస్సులను భవిష్యత్‌లో మూడు రకాలుగా విభజించి నడపాలని నిర్ణయించాం. 50% బస్సులు(5200) పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే వుంటాయి. 30% బస్సులు(3100) అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడపడం జరుగుతుంది. వాటిని కూడా ఆర్టీసీ డిపోలలోనే ఉంచుతారు. మరో 20% బస్సులు (2100) పూర్తిగా ప్రయివేటువి, ప్రయివేట్ స్టేజ్ కారేజ్ విగా అనుమతి ఇస్తార’ని సీఎం తెలిపారు. 

కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారు
క్రమశిక్షణ చర్యలు అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. కొత్తగా చేరే కార్మికులకు భవిష్యత్‌లో బోనస్‌ ఇచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులు పండుగలు, పరీక్షల సమయంలో సమ్మె పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న యూనియన్లు వాటి అస్థిత్వాన్ని కోల్పోయాని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీలో ప్రస్తుతం 1200 మంది మాత్రమే ఉన్నారని పునరుద్ఘాటించారు. తాము ఎవరిని డిస్మిస్‌ చేయలేదని.. గడువులోగా విధులకు హాజరుకాకుండా వాళ్లకు వాళ్లే సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారని పేర్కొన్నారు. సమ్మెకు దిగిన కార్మికులు డిపోల వద్ద, బస్‌ స్టేషన్ల దగ్గర గొడవకు దిగకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా డీజేపీని ఆదేశించారు. 

బస్‌పాస్‌లు అలాగే కొనసాగుతాయి..
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్ర్య సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందినవారికి, ఉద్యోగులు, తదితరులకు కూడా ఇక ముందు సబ్సిడీ బస్‌పాస్‌లు కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దానికి అయ్యే నిధులను బడ్జెట్‌లో కేటాయించడం జరుగుతుందని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement