అన్ని రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఎన్నికలకు మందు ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బక్కని రవిమాదిగ విమర్శించారు.
కందుకూరు(రంగారెడ్డి జిల్లా): అన్ని రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఎన్నికలకు మందు ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బక్కని రవిమాదిగ విమర్శించారు. శుక్రవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్‌సాన్‌పల్లిలో ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి ఎరుపుల శంకరయ్య, ప్రధానకార్యదర్శి నందిగామ నర్సింహ ఆధ్వర్యంలో మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం వచ్చేనెల 5న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించనున్న మహిళా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకపోవడం బాధాకరమన్నారు. మహిళా హక్కులు, సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేసేలా ప్రతి గ్రామం నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.