సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన, రీ ఇంజనీరింగ్ చేసిన ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో నిధుల పంట పండనుంది. రూ.25 వేల కోట్ల బడ్జెట్‌లో వాటికే దాదాపు 76 శాతం నిధులు కేటాయించేలా ప్రణాళికలు తయారయ్యాయి. ఈ బడ్జెట్ ప్రణాళికకు ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. ఇందులో పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ఎత్తిపోతలకు రూ.8 వేల కోట్ల చొప్పున కేటాయించారు. రీ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న డిండి, దుమ్ముగూడెం, కంతనపల్లి, ఇందిరమ్మ వరద కాల్వలకు భారీగా నిధుల కేటాయించేలా బడ్జెట్ ప్రణాళికలు తయారయ్యాయి.
కేంద్ర బడ్జెట్‌కు ముందే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండు వారాల కిందటే సాగు శాఖ నీటి బడ్జెట్ ప్రతిపాదనలు కోరింది. రూ.34 వేల కోట్ల ప్రతిపాదనలు అంచనాలు తయారుకాగా, ఆర్థిక శాఖ సూచన మేరకు ఉన్నతాధికారులు రూ.25 వేల కోట్లతో తుది ప్రణాళిక ఖరారు చేశారు. ఇందులో సాగు నీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) కింద రూ.400 కోట్లు, సమర్ధ నీటి వాడక కార్యక్రమం(ఈఏపీ) కింద రూ.650 కోట్లు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్) కింద రూ.400 కోట్లు వస్తాయని అంచనాల్లో చూపగా... మిగతా నిధులను రాష్ట్ర నిధుల నుంచి కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
నిధుల కేటాయింపుల్లో ఎక్కువగా కొత్తగా, రీ ఇంజనీరింగ్ చేసిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పిం చారు. పాలమూరు, ప్రాణహితలకే రూ.16,002 కోట్ల మేర కేటాయించగా, డిండికి రూ.784 కోట్లు, ఇందిరా, రాజీవ్ దుమ్మగూడెంలకు కలిపి రూ.500 కోట్లు, కంతపనల్లికి రూ.250 కోట్లు, ఇందిరమ్మ వరద కాల్వకు రూ.600 కోట్లతో బడ్జెట్ ప్రణాళిక వేశారు. వీటికి రూ.19,136 కోట్ల మేర కేటాయింపులు జరిపారు. దిగువ పెనుగంగకు రూ.150 కోట్లు, నిజాంసాగర్ ఆధునికీకరణకు రూ.112 కోట్లతో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇక నిర్మాణ చివరి దశలో ఉన్న మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు రూ.900 కోట్ల మేర కేటాయింపులు జరిపారు. ఇందులో కల్వకుర్తి రూ.350 కోట్లు, నెట్టెంపాడు రూ.150, భీమాకు రూ.142 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.55 కోట్ల మేర కేటాయించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్‌లోని మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టు లక్ష్యాలను చేరేలా కేటాయింపుల ప్రతిపాదనలు ఓకే అయ్యాయి.
మైనర్ ఇరిగేషన్‌కు 2,304 కోట్లు
చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ.2,304 కోట్లు కేటాయించనున్నారు. ఇందులో ఏఐబీపీ, ఆర్‌ఐడీఎఫ్‌ల కింద రూ.600 కోట్ల వస్తాయని అంచనా వేయగా, మరో రూ.1704 కోట్లు రాష్ట్ర నిధుల నుంచి కేటాయించనున్నారు. ఈ నిధులతో లక్ష్యంగా పెట్టుకున్న 9 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనున్నారు.
'సాగు'కు రూ.25 వేల కోట్లు
Published Mon, Nov 30 2015 2:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement