కర్కాటక రాశి... కదంబం మొక్క..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హరితహారం కార్యక్రమంలో తన జాతకఫలం ప్రకారం మొక్కను నాటబోతున్నారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్న హరిత హారం కార్యక్రమం కోసం సీఎం కర్కాటక రాశి ప్రకారం కదంబం మొక్కను హైదరాబాద్ నుంచి అధికారులు తెప్పించారు. ఈ మొక్కను చౌటుప్పల్ మార్కెట్‌యార్డు ఆవరణలో ఆయన నాటనున్నారు. అనంతరం అక్కడి నుంచి చిట్యాల మండలం గుండ్రాంపల్లికి వచ్చి అక్కడ ఎన్‌హెచ్-65 పక్కన పూలమొక్కలను నాటడం ద్వారా ఆయన హరితహారం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్కడే ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఎన్‌హెచ్-65 పొడవునా కోదాడ మండలం నల్లబండ గూడెం వరకు వెళ్తారు. ఈ దారిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం వెళ్లనున్నారు. ప్రజలకు సీఎం అభివాదం కనిపించే ఎత్తులోనే హెలికాప్టర్ వెళుతుందని అధికారులు చెపుతున్నారు. హెలికాప్టర్ దిగకుండానే ఆయన మళ్లీ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమై వెళ్లిపోతారు. దీంతో నల్లగొండ జిల్లాలో హరితహారం ప్రారంభ కార్యక్రమం ముగియనుంది.
కదంబం కథ ఇది...
హరిత హారంలో భాగంగా సీఎం కేసీఆర్ నాటనున్న ఈ మొక్కకు చాలా ప్రాశస్త్యమే ఉందని తెలుస్తోంది. దీనిని రుద్రాక్షాంబ అని, కదంబం అని అంటారు. శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్‌సిస్.. రూబియేసి కుటుంబానికి చెందిన మొక్క. కాఫీ మొక్క కూడా ఇదే కుటుంబానికి చెందినది. దీంతో ఆ చెట్టు లక్షణాలే దీనికి ఉంటాయి. ఎల్లప్పుడూ ఆకురాల్చని, ఆకుపచ్చగా ఉండే మొక్క ఇది. నీడ కోసం బాగా పెంచుతారు. సామాజిక అడవుల పెంపకానికి అనువైన మొక్క ఇది. దీని పుష్పాలు గుండ్రంగా తుమ్మపూల మాదిరిగా కనిపిస్తాయి. ఈ పుష్పాల నుంచి రకరకాల సుగంధభరిత అత్తర్లు తయారు చేస్తున్నారు.
పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికివస్తుంది. భగవద్గీతలో కూడా దీని గురించి ప్రస్తావించారు. రాధాకృష్ణులకు నచ్చే మొక్క ఇది... ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ వారి ప్రేమాయణం కొనసాగిందని, అందుకే దీనిని హిందువులు పవిత్రమొక్కగా భావిస్తారని సమాచారం. గోపికల చీరలను కృష్ణుడు తీసుకెళ్లి ఈ రుద్రాక్షాంబ చెట్టు మీదే ఉంచినట్టు కూడా మహాభారతంలో ఉందట. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది.