
సచివాలయాన్నే కాదు రాష్ట్రాన్నే అమ్మేస్తారేమో?
సీఎం కేసీఆర్ తీరుపై జీవన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వ్యవహారశైలి, వివిధ అంశాలపై ఆయన చేస్తున్న ఏకపక్ష ప్రకటనలపై కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉపనేత టి.జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే సచివాలయాన్నే కాదు, రాష్ట్రాన్ని కూడా అమ్మేసేలా ఉన్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తుదోషం ఉందంటూ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలని సీఎం అనుకోవడం ఎంతమాత్రం సరికాదన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తన వ్యక్తిగత సెంటిమెంట్లను రాష్ర్టంపై రుద్దడం ఏమిటని నిలదీశారు.
రాష్ట్రంలో ఒకవైపు అనేక సమస్యలున్నాయని, విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్, రైతులకు రుణమాఫీ, మరోవైపు తీవ్రరూపం దాలుస్తున్న కరువుపరిస్థితులు వీటన్నింటిని పట్టించుకోకుండా నేలవిడిచి సాము చేయడం సరికాదన్నారు. విద్యుత్ సమస్య తీవ్రమవుతోందని, ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ గురించి ఆలోచించకుండా ఎర్రగడ్డలో సచివాలయం ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తే ఎలా నిలదీశారు.
ఇసుక అక్రమరవాణాకు ప్రభుత్వానిదే బాధ్యత..
తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, అందుకు బాధ్యులైన గనులశాఖ మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంకు అల్లుడు కావడం వల్లే హరీశ్‌పై చర్యలు తీసుకోవడంలేదని, అమాయకుడైన మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యపై మాత్రం వేటు వేశారన్నారు.
తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో రిలేనిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం ప్రతినిధులను శుక్రవారం ఆయన కలసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు అలవాల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, నాయకులు రాంమోహన్ రెడ్డి, రాజారాం, చిరంజీవి, మధు, పి. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.