
బినామీల తాట తీస్తాం
♦ వారి భూములు స్వాధీనం చేసుకుంటాం: సీఎం కేసీఆర్
♦ పార్టీ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం
సాక్షి, హైదరాబాద్
‘‘రాష్ట్రంలో నిజాం కాలంనాటి భూముల రికార్డులే నేటికీ ఉన్నాయి. దీంతో ఎవరి భూములు ఎవరి పేర ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి ఉంది. భూ రికార్డులు ప్రక్షాళన చేయకుంటే ఈ వివాదాల ను తీర్చలేం. రికార్డుల ప్రక్షాళనతో బినామీలు బయట పడతారు. బినామీల తాట తీసేలా.. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
రాష్ట్రంలో నిర్వహించనున్న సమగ్ర భూ సర్వేలో ప్రజాప్రతినిధులనూ భాగస్వాములను చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భూ సర్వే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నేతలకు వివరించారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న రైతులకు పెట్టుబడి పథకం విజయవంతం కావాలన్నా, నిజమైన రైతులు లబ్ధి పొందాలన్నా భూరికార్డుల ప్రక్షాళన తక్షణ అవసరమని సీఎం పేర్కొన్నారు.
ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించడం లేదు
ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని ప్రతిపక్షాలు ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నా ప్రజలు విశ్వసించడం లేదని, ఎవరు ఎలాంటి సర్వేలు చేసినా అన్నీ తమకే అనుకూలంగా వస్తున్నాయని సీఎం అన్నారు. 2019లో అధికారం మళ్లీ టీఆర్‌ఎస్‌దేనని, కనీసం 100 నుంచి 105 స్థానాలు పార్టీ దక్కించుకుం టుందని పేర్కొన్నారు. సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని ఎమ్మెల్యేలకు అభయమి చ్చారు. కేవలం కొన్ని రిజర్వుడు నియోజక వర్గాల్లోనే కొంత బలహీనంగా ఉన్నామని, అవి సరిదిద్దుకుంటే అనుకున్న స్థానాలు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు.
ఇదీ ప్రక్షాళన షెడ్యూల్
భూరికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఎం నేతలకు వివరించారు. ‘‘సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు గ్రామస్థాయిలో రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటవుతాయి. గ్రామ కమిటీల్లో 15 మంది సభ్యులు ఉంటారు. మండల, జిల్లా రైతుల సమన్వయ కమిటీల్లో 24 మంది చొప్పున సభ్యులు ఉంటా రు. 42 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటవు తుంది. వారిని స్థానిక ఎమ్మెల్యేలే ఎంపిక చేస్తారు. ఆ తర్వాత 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మండలాల్లో రైతు సంఘాలతో అవగాహన సదస్సులు ఉంటాయి. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మూడు నెలలపాటు పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది’’అని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియ అంతా మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల నుంచి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో రైతుల సంఘాల ద్వారా సమన్వయపరిచే బాధ్యత తీసుకోవాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే ఎమ్మెల్యేల భాగస్వామ్యం తప్పనిసరి పేర్కొన్నారు.
రైతుల గుండెల్లో నిలిచిపోతాం
భూ రికార్డుల ప్రక్షాళన కొలిక్కి వస్తే రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతా మని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతగా వినియోగించు కుంటే ఎమ్మెల్యేలకే అంత మంచిదన్నారు. 10,800 రెవెన్యూ గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని, ప్రతీ 3 గ్రామాల బాధ్యత ఒక ప్రజాప్రతినిధి తీసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ రైతు సమన్వయ కమిటీలు ఏర్పా టు కావాలని, రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా ముగించేందుకు వెయ్యి మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తాం. 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)ని ఇస్తాం. 2,500 క్లస్టర్లకు ఒక రైతుభవన్ నిర్మిస్తాం’’అని ప్రకటించారు.