సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు నిర్మించ తలపెట్టిన కేశవాపూర్ రిజర్వాయర్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా కేశవాపూర్ మంచినీటి పథకం పనుల శంకుస్థాపనకు తానే స్వయంగా వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్ పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో అటవీ భూములు, పట్టా భూములు, అసైన్డ్ భూములు కలిగి ఉన్నాయని సంబంధిత అధికారులతో కలెక్టర్ ఎంవీరెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్ పాయింట్ ఎక్కడ వస్తుందని సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ గట్టు ఎక్కడ వరకు ఉందని అడిగారు. రిజర్వాయర్ భూసేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు తమకు రావలసిన నష్టరరిహారం త్వరగా ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ ఎంవీరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు త్వరలో ఇప్పిస్తామని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, కీసర ఆర్డీఓ లచ్చిరెడ్డి, తహశీల్దార్ నాగరాజు, శామీర్‌పేట్ తహశీల్దార్ గోవర్దన్, కీసర ఎంపీడీఓ శశిరేఖ, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
రిజర్వాయర్ ప్రత్యేకతలివే...
శామీర్‌పేట్ సమీపంలోని కేశవాపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 623 అడుగుల ఎత్తులో కొండ పోచమ్మ సాగర్‌ను 17 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టును కాళేశ్వరం జలాలతో నింపనున్నారు. సీజన్లో రెండు అడుగుల మేర గోదావరి జలాలు ఈ జలాశయంలో చేర్చినప్పటికీ, అక్కడికి 16 కిలో మీటర్ల దూరంలోని కేశవాపూర్ రిజర్వాయర్‌కు (585 అడుగుల ఎత్తు) పైసా ఖర్చు లేకుండా గ్రావిటీ ఆధారంగానే సరఫరా చేసేందుకు వీలుగా 3,600 ఎంఎం డయా వ్యాసార్ధం గల భారీ మైల్డ్ స్టీల్ పైప్‌లైన్లనూ రెండు వరుసల్లో ఏర్పాటు చేయనున్నారు. అక్కడికి సమీపంలో బొమ్మరాసుపేట్ నీటి శుద్ధి కేంద్రంలో 172 మిలియన్‌గ్యాలన్ల(10 టీఎంసీలు) రా వాటర్‌ను శుద్ధిచేసి శామీర్‌పేట్ ,సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైప్‌లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా, రిజర్వాయర్ నిర్మాణంతో హైదరాబాద్ మహానగర జనాభా 2030 నాటికి రెండు కోట్లకు చేరుకున్నప్పటికీ తాగు నీటికి ఢోకా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 2300 ఎకరాల భూమి అవసరం కాగా, రూ.4,396 కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారవర్గాల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment