
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడింది. భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి తుది అటవీ అనుమతులు మంజూరయ్యాయి. అత్యంత కీలకమైన ఈ అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ చెన్నై కార్యాలయం డిప్యూటీ కన్జర్వేటర్ కె.గణేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 6.75 లక్షల ఎకరాలకు నీరందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.
ఈ ప్రాజెక్టుకోసం సుమారు 20,946.72 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, అటవీభూమి 3,827.63 ఎకరాలు. ఇందులో మణుగూరు డివిజన్‌లో 212.95 హెక్టార్లు, పాల్వంచ పరిధిలో 618.95, కొత్తగూడెం డివిజన్ పరిధిలో 369.09, సత్తుపల్లిలో 277.41, ఖమ్మం డివిజన్ పరిధిలో 52.64 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ అటవీ భూముల పరిధిలో కాల్వలు, టన్నెళ్లు, పంప్‌హౌస్‌లు, విద్యుత్ లైన్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ అటవీ అనుమతులకు స్టేజ్–1 క్లియరెన్స్ గత ఏడాది ఫిబ్రవరిలోనే మంజూరయింది. భూములకు పరిహారాన్ని చెల్లించడంతో బుధవారం తుది స్టేజ్–2 అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే వన్యప్రాణి బోర్డు, పర్యావరణ అనుమతులు సైతం మంజూరు అయ్యాయి. తాజాగా అటవీ అనుమతులకు క్లియరెన్స్ దక్కడంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment