
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 61 అడుగు ల ఎత్తులో దర్శనమివ్వనుంది. మహాగణపతి చరిత్రలోనే ఇదే అత్యధికం. వాస్తవానికి మహాగణపతి 60 అడుగులకు చేరిన తర్వాత ప్రతిఏటా ఒక్క అడుగు చొప్పున ఎత్తుతగ్గిస్తున్న విషయం విదితమే. ఈసారి ద్వాదశాదిత్య రూపంలో భారీ గణపతిని తయారు చేయనున్న నేపథ్యంలో ఎత్తు 61అడుగులు ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు తుది నమూనాను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు మంగళవారం విడుదల చేశారు.
ఎందుకీ పేరు?
సూర్యుడు మనకు 12 రూపాల్లో కిరణాలుఅందిస్తాడు. అందుకే ద్వాదశాదిత్యుడని పేరు.ఆ 12 రకాల కిరణాల చెడు ప్రభావం మనపై పడకుండా కాపాడేందుకు ద్వాదశాదిత్య మహాగణపతిగా నామకరణం చేశాం. సూర్యుడు కూడా మహాగణపతి అధీనంలో ఉన్నాడని చెబుతూ.. ఈ సంవత్సరం అతివృష్టి, అనావృష్టి లేకుండా వర్షాలు కురవాలని, నవగ్రహ,రాహుకేతు, శనేశ్వరుడు, కుజ గ్రహాల దుష్ప్రభావాల నుంచిప్రజలను మహాగణపతి కాపాడాలని విగ్రహాన్ని ఈ రూపంలో తయారు చేయాలని నిర్ణయించాం. – దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ
అందుకే ఇంతెత్తు..
వినాయకుడి ఎత్తు గతేడాది 56 అడుగులే ఉంది. ఈసారి వినాయకుడి తలపై మరొక తలను అదనంగా ఏర్పాటు చేయడం, దానిపై సూర్యభగవానుడి చక్రం, ఆపై 12 తలల పాములను ఏర్పాటు
చేయడంతో గణపతి ఎత్తు 61 అడుగులకు చేరుకుంది. – శిల్పి రాజేంద్రన్
ప్రత్యేకతలివీ...
పేరు: ద్వాదశాదిత్య మహాగణపతి
ఆకారం: సూర్య భగవానుడి రథంపై 61 అడుగుల ఎత్తు
28 అడుగుల వెడల్పు
50 టన్నుల బరువు
12 ముఖాలు
24 చేతులు
12 సర్పాలు
అశ్వాలు: 7 (వీటి ఎత్తు 20 అడుగులు)
రథం లోపల కుడివైపు: మహంకాళి, మహాసరస్వతి స్వరూపమైన సిద్ధకుంజికా దేవి 12 అడుగుల ఎత్తులో 3 ముఖాలు, 6 చేతులతో ఉంటుంది.
రథం లోపల ఎడమవైపు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయస్వామి 12 అడుగుల ఎత్తులోగోవుతో నిలబడి ఉంటారు. విగ్రహానికి కుడివైపు మహావిష్ణువుతో పాటు ఏకాదశి దేవి విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఉంటాయి. విగ్రహానికి ఎడమవైపు త్రిమూర్తులతో దుర్గాదేవి విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఉంటాయి.
షెడ్డు ఎత్తు 65 అడుగులు
వెడల్పు 30 అడుగులు
Comments
Please login to add a commentAdd a comment