ఖమ్మం దిగ్బంధనం
జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు
- రైతులకు మద్దతుగా ప్రతిపక్షాల ఆందోళన
- మార్కెట్‌పై దాడి కేసులో రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ముదిగొండ ఠాణా ఎదుట భట్టి బైఠాయింపు
సాక్షి, ఖమ్మం: మిర్చి మార్కెట్‌పై దాడి ఘటన తో ఖమ్మం జిల్లాను పోలీసులు దిగ్బంధనం చేశారు. మిర్చి మార్కెట్‌పై దాడి ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించడం, సీఎం కేసీఆర్ సీరియస్ కావడంతో పోలీసులు అప్ర మత్తమయ్యారు. రైతుల ఆందోళనకు మద్దతు గా జిల్లాలోకి ప్రతిపక్షపార్టీల ప్రజాప్రతినిధు లు, నేతలు రాకుండా సరిహద్దుల్లోనే చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వచ్చే నెల 12 వరకు 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాకు పక్కనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం పోలీసులను కూడా రప్పించి భారీ బందోబస్తు నిర్వహించారు.
ప్రతిపక్షాల నిరసన ర్యాలీలు, పార్టీ కార్యాలయాల వద్ద బందోబస్తు, ఆందోళనలు, అరెస్ట్‌లతో శనివారం ఖమ్మం అట్టుడికి పోయింది. మార్కెట్‌లో భారీ బందోబస్తు నడుమ కొనుగోళ్లను ప్రారంభించారు. ఖమ్మం సరిహ ద్దులోని నాయకన్‌గూడెం వద్ద, కోదాడ వైపు నేలకొండపల్లి వద్ద, వరంగల్ వైపు తిరుమ లాయపాలెం వద్ద చెక్‌పోస్టులు ఏర్పా టు చేసి వాహనాలను తనిఖీ చేశారు. మార్కెట్ ఘటనపై జిల్లాలోని ప్రతిపక్షాలు ఉదయం నుంచే ఆందోళనకు సమాయత్తం కాగా, పోలీసులు ముందస్తుగానే టీడీపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ కార్యాల యాల వద్ద నిఘా పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యనేతల కదలికలు, పార్టీ శ్రేణుల నిరసనలను కట్టడి చేశారు.
దాడి ఘటనలో రైతుల అరెస్టు
మార్కెట్ కార్యాలయాలపై దాడి ఘటనలో ముదిగొండ మండలానికి చెందిన చిరుమర్రి, బాణాపురం గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారనే ఉద్దేశంతో అక్కడి రైతులను ముదిగొండ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ముదిగొండ ఠాణా వద్ద ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బైఠాయించారు. రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలియడంతో ముదిగొండ, నేలకొండపల్లి, బోనకల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ‘‘సీఎం డౌన్‌డౌన్.. రైతు వ్యతిరేకి కేసీఆర్’’అంటూ నినాదాలు చేశారు. రైతులు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఏసీపీ సురేశ్‌కుమార్ ఠాణాకు వచ్చారు. పరిస్థితి చేయిదాటుతుందన్న ఉద్దేశంతో భట్టిని అరెస్ట్ చేసి కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల అదుపులో లెఫ్ట్ నేతలు
సీపీఐ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా వస్తున్న రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని, కార్యకర్తలను బైపాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని కొణిజర్ల పోలీస్‌స్టేషన్ కు తరలించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమో క్రసీ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరిన ఆ పార్టీ నేతలు పోటు రంగా రావు, రాయల చంద్రశేఖర్‌లను అదుపులోకి తీసుకుని అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, విడుదల చేశారు. ఖమ్మం లో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నేత నామా నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, నేలకొండ పల్లిలో టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కూసుమంచిలో బీజేపీ నేత గోలి మధు సూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల హైరానా..
మిర్చి మార్కెట్‌ను సందర్శించడానికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వస్తు న్నారని తెలుసుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్ట డంతోపాటు ఖమ్మంలోని అన్ని వైపులా వాహనాల తనిఖీ చేయించారు. ఎటువైపు నుంచి ఎవరు వస్తున్నారో? ఏం జరుగుతుందో అర్థంకాక పోలీసులు అవస్థలు పడ్డారు. అరెస్ట్‌లతో పార్టీల నేతలు ఆందోళనకు గురయ్యారు. నేలకొండపల్లిలో టీడీపీ, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. కూసుమంచి, పాలేరు, ఖమ్మంరూరల్ ప్రాంతాల్లో, హైదరాబాద్– ఖమ్మం రోడ్లపైకి టీఆర్‌ఎస్ శ్రేణులు వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు.