జాతీయ రహదారులతో ఖమ్మం జిల్లాకు అనుసంధానం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల
భద్రాచలం: జాతీయ రహదారులతో ఖమ్మం జిల్లాను అనుసంధానం చేయటం ద్వారా దేశం గుర్తించేలా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమశాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి పర్యటన భద్రాచలం నుంచే ప్రారంభించారు. భద్రాచలం శ్రీసీతారామంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న రె ండో బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఏడాదిన్నరలో బ్రిడ్జి పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. వచ్చే పుష్కరాల నాటికి సారపాక వైపున అప్రోచ్ పూర్తి చేయాలని ఎన్‌హెచ్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధాన రహదారులను నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఎన్‌హెచ్ 221 రహదారి ఆధునీకరణకు ఇప్పటికే రూ.539.77 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని రోడ్లను జాతీ య రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. కొత్త రాష్ట్రంలో తొలిసారిగా జరిగే గో దావరి పుష్కరాలతో జిల్లాకు కీర్తి తెచ్చిపెట్టేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచిం చారు. ఆ తరువాత జిల్లాలోని మారుమూలన గల వాజేడు మండలంలో పూసూరు- వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మధ్య గోదావరి నదిపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఖమ్మం కలెక్టర్ ఇలంబరితి, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ గడి పల్లి కవిత, ఐటీడీఏ పీవో దివ్య, జిల్లా ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసిం ఉన్నారు.