ఇంటి నిర్మాణానికి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తున్న ఓ వ్యక్తిని వెంబడించి డబ్బులు అపహరించారు.
బైక్ నుంచి రూ.2.95 లక్షలు మాయం
భీమారం : ఇంటి నిర్మాణానికి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తున్న ఓ వ్యక్తిని వెంబడించి డబ్బులు అపహరించారు. ఈ సంఘటన హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం... బ్యాంక్ కాలనీకి చెందిన భాస్కర్ లింగం స్థానికంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడానికి దయం వెళ్లాడు. పెట్రోల్ పంప్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.2లక్షలు డ్రా చేశాడు. అక్కడి నుంచి మర్కజీ పాఠశాల ఎదుట ఉన్న మరో బ్యాంక్ నుంచి రూ.95 వేలు తీసుకున్నాడు. భాస్కర్‌లింగం ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేస్తున్న క్రమంలోనే కొంతమంది దుండగులు అతడిని అనుసరించినట్లు తెలుస్తోంది.
మర్కజీ ఎదుట ఉన్న బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని భీమారం వైపునకు వస్తున్న క్రమంలో వెనుక వైపు నుంచి ఏదో ద్రవపదార్ధం ఆయనపై చల్లారు. దీంతో కొంత దూరం వరకు ఆయన ఇబ్బందులకు గురయ్యాడు. కాకతీయ యూనివర్సిటీ సమీపంలోకి రాగా, ఆయన బైక్ (కెనెటిక్ హోండా) పంక్చర్ అయింది. తన వాహనాన్ని కొద్ది దూరం నెట్టుకెళ్లాడు. అక్కడికి వెళ్లి ట్యూబ్‌ను పరిశీలిస్తే... గుండుపిన్‌తో టైర్‌కు కుచ్చినట్లు గ్రహించాడు. పంక్చర్‌ను అతికించుకున్న తర్వాత అక్కడి నుంచి సమీపంలోని ఓ కిరాణం షాపుకు వచ్చి కోడి గుడ్లు తీసుకున్నాడు. ఆ సమయంలో భాస్కర్‌లింగం.. వాహనంలో తన డబ్బులు ఉన్నాయా.. లేవా... అని పరిశీలించాడు. కనిపించకపోవడంతో లబోదిబోమంటూ అక్కడే కుప్పకూలాడు. ఈ మేరకు బాధితుడు కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.