రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానిని కాపాడుకోవాలంటే నగరంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో రోగులకు ఆయన పండ్లు పంపిణీ చేశారు. తొలుత ఛాతీ ఆస్పత్రిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా చీపురు చేతపట్టి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నానాటికీ నగరంలో ట్రాఫిక సమస్య, కాలుష్యం పెరిగిపోవడం, మరోవైపు డెంగీ లాంటి ప్రమాదకర జ్వరాలు వస్తున్నాయని అన్నారు. ఎక్కడ చూసినా చెత్త, వ్యర్థాలు పెద్ద మొత్తంలో కనిపిస్తున్నాయని, జీహెచ్‌ఎంసీ అధికారులు మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. విషజ్వరాలకు కారణమైన మురుగు కూపాలకు స్వస్తి చెప్పాలని, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య, జల, వాయు కాలుష్యాల నుంచి ప్రజలను రక్షించుకుంటేనే నగర బ్రాండ్ ఇమేజ్ నిలబడుతుందన్నారు. ప్రధాని సూచించినట్టుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించాలన్నారు. సమావేశంలో ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఎన్.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment