కెంగర్ల మల్లయ్యకు కండువా కప్పి బీఎంఎస్‌లోకి ఆహ్వానిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): సింగరేణిలో భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్)ను పటిష్టంగా తీర్చిదిద్దాలని, కెంగర్ల మల్లయ్య పూర్తి బాధ్యతలు తీసుకుని సంస్థ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో సంఘాన్ని బలోపేతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీహాలులో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలపై గంటకు పైగా అసెంబ్లీలో మాట్లాడానన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులే లేరని చెప్పారని, దీంతో వాస్తవాలు తెలుసుకునేందుకు సింగరేణిలో అన్నిగనులు పర్యటించానన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాటల గారడీతో కార్మికులను మభ్యపెట్టి కాలం వెల్లదీస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు అందరికన్నా ముందున్నారని కొనియాడారు. తెలంగాణా వస్తే న్యాయం జరుగుతుందని, కార్మికుడికి గౌరవం పెరుగుతుందని భావించారు కానీ అన్నింటా అన్యాయమే జరిగిందన్నారు. నిమ్స్‌లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెంలలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. జెన్‌కో ఇవ్వాల్సిన సుమారు రూ. 8నుంచి రూ.10వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదన్నారు. కనీసం డాక్టర్లను కూడా పెట్టుకోలేని పరిస్థితి సింగరేణిలో ఉందన్నారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ఏమైపోయిందన్నారు. సింగరేణి కార్మిక సంఘాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికులను ఎందుకు పర్మనెంట్ చేయలేదని ప్రశ్నింన్నారు.
బీఎంఎస్‌ను బలోపేతం చేయాలి
కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కార్మికులకు అండగా నిలబడతా తప్ప ప్రభుత్వానికి వత్తాసు పలకనన్నారు. యూనియన్‌లో చేరిన కెంగర్ల మల్లయ్య పూర్తి బాధ్యతలు తీసుకుని సంఘాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. సింగరేణి యాజమాన్యాన్ని కార్మికులను వేధించాలను కున్నా, భయపెట్టాలనుకున్నా కేంద్రంలో ఆషామాషీ ప్రభుత్వం లేదని, కార్మికులకు అండగా నిలబడతానన్నారు. తెలంగాణలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీరు చెల్లించిన ఇన్‌కంటాక్స్ తిరిగి చెల్లించేలా చేస్తానన్నారు. బీఎంఎస్ వేజ్‌బోర్డు సభ్యులు బీకేరాయ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీఎంఎస్ నాయకులు చింతల సూర్యనారాయణ, మల్లేశం, మాధవనాయక్, బి వనిత, లట్టి జగన్మోహన్‌రావు, పులి రాజిరెడ్డి, బిలక్ష్మీనారాయణ, కెంగర్ల మల్లయ్య, మాదాసు రాంమూర్తి పాల్గొన్నారు. బీఎంఎస్‌లో చేరిన కెంగర్ల టీబీజీకేఎస్ మాజీ నాయకులు ఉన్న కెంగర్ల మల్లయ్య సోమవారం బీఎంఎస్‌లో చేరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీఎంఎస్ వేజ్‌బోర్డు సభ్యుడు బీకేరాయ్ కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. సోమవారం గోదావరిఖనిలోని సింగరేణి కమ్యూనిటీ హాలులో జరిగిన సభలో బీఎంఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో బీఎంఎస్ కండువాలను కప్పుకున్నారు. మల్లయ్యతో పాటు మాదాసు రాంమూర్తి, అప్పాని శ్రీనివాస్, సంపత్‌రావు, నాగెల్లి సాంబయ్య, నాచగోని దశరథంగౌడ్, గాజుల తిరుపతి, నరేంద్రబాబు, వై.సారంగపాణి, పర్లపల్లి రవీందర్, అర్కాల ప్రసాద్, దాసరి శంకర్, పూర్ణ సత్యనారాయణ, ముక్కెర సుధాకర్, మణుగూరు మల్లేష్, ఆరుట్ల మాధవరెడ్డి, బొల్లెద్దుల ప్రభాకర్, పెర్క సత్యనారాయణ, గోపి, అమరకొండ రాజయ్య, తాళ్లపెల్లి రామయ్య, ఎండీ రఫీస్, సుంకర విజయ్, రమేష్, వాసర్ల జోషఫ్‌తో పాటు 11 ఏరియాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఎంఎస్‌లో చేరారు. భూగర్భ గనుల జాడలేకుండా పోయింది సింగరేణిలో భూగర్భ గనుల జాడే లేకుండా పోయిందన్నారు. ఉద్యోగాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయన్నారు. కార్మికుల పిల్లలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, యాజమాన్యంపైన ఉందన్నారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కార్మికులు కన్నతల్లిగా కాపాడుకుంటున్నారని అన్నారు. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానినికి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం పెరిగిపోయిందన్నారు. చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment