godavari kani
-
పులి పయనం ఎందాక?
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పక్షం రోజులుగా జిల్లాలో తిరుగుతున్న పులి అనువైన ఆవాసం దొరకక ప్రయాణం కొనసాగిస్తోంది. జిల్లాలో రోజుకో ప్రాంతంలో అడుగులు దర్శనమిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో అడుగులు కనిపించిన ప్రాంతానికి అటవీశాఖ అధికారులు చేరుకుని పులివే అని నిర్ధారించి వదిలేస్తున్నారు. పులిని పట్టుకుని తరలించే ప్రయత్నంకానీ, అనువైన ఆవాసం కల్పించే ప్రయత్నంకానీ, జిల్లా దాటించే ప్రయత్నం కానీ చేయడం లేదు. దీంతో ప్రజలు ఏరోజు ఎక్కడ పులిని చూడాల్సి వస్తుందో.. ఎవరిపై దాడిచేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఆరు మండలాల్లో సంచారం.. ఈనెల 7వ తేదీన ముత్తారం మండలం ఓడేడు శివారులో భూపాల పల్లి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రయాణం నిరంతరం కొనసాగిస్తోంది. ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పెద్దపల్లి, పాలకుర్తి మండలాల మీదుగా, రామగుండం మండలం ఎన్టీపీసీ రిజర్వాయర్ వరకు సాగింది. అయితే ముత్తారం మండలం మచ్చుపేట శివారులోని బగుళ్ల గుట్ట అడవుల్లో ఆవుల మందపై దాడిచేసిన సమయంలో మాత్రమే పెద్దపులి పశువుల యజమానికి కనిపించింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మంథని–పెద్దపల్లి రహదారి మీదుగా కారులో వెళ్తున్న యువకులు పులి రోడ్డు దాటుతుండగా చూశామని చెబుతున్నారు. ఈరెండేసార్లు మినహా ఎక్కడా ఎవరికీ పులి కనిపించలేదు. బగుళ్ల గుట్టవద్ద మినహా ఎక్కడా పశువులకు, మనుశులకు ఎలాంటి హాని తలపెట్టకుండా తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపంలో పాద ముద్రలు ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. పుట్నూరు ప్రాంతంలో నుంచి పులి శనివారం తెల్లవారుజామున బుగ్గ గుట్ట మీదుగా భామ్లా నాయక్ తండా గుండా ఎన్టీపీసీ రిజర్వాయర్ అటవి ప్రాంతానికి చేరుకుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంధన నిల్వల కేంద్రం, గాడిదల గండి వైపు వెళ్లిందని అడుగుల ఆధారంగా గుర్తించామని అటవీ శాఖ సెక్షన్ అధికారి రహ్మతుల్లా, బీట్ అధికారులు నరేశ్, రమేశ్ వివరించారు. వీరితోపాటు భీమ్లా నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ కూడా ఉన్నారు. రాజీవ్ రహదారి ఎలా దాటింది..? పులి పుట్నూరు నుంచి బుగ్గ గుట్ట మీదుగా ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిని దాటాలి. రోడ్డు దాటే క్రమంలో ఎవరికీ కనిపించకపోవడం ప్రశ్నగా మారింది. పులి సంచరించినట్లు తెలు పుతున్న అధికారులు పులి ఏ వైపుకు వెళుతుందో.. అటవీ ప్రాంతం వివరాలు అధికారులకు తెలిసినా రాత్రి సమయంలో కాపు కాయకపోవడంతోనే పులి సంచారాన్ని కనుక్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పులి బుగ్గ గుట్ట నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వెళ్లిందా అనే విషయాలపై కూడా పూర్తి స్పష్టత కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం కూడా పులి సంచారం.. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలోకి 2018, జూన్‌లో రెండు పులులు సంచిరించినట్లు అధికారులు ధ్రువీకరించారు. రెండు పులులలో ఒకటి చిన్నది, మరొకటి పెద్దదిగా ఉన్నాయని పాద ముద్రల ఆధారంగా నిర్ధారించారు. ఆ తర్వాత పులులు ఎటు వెళ్లాయో కూడా పూర్తి సమాచారం లేదు. రెండేళ్ల వచ్చిన చిన్న పులి పెరిగి పెద్ద అయి మళ్లీ ఈ ప్రాంతంలో సంచరిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతం పూర్తి రక్షిత ప్రాంతం అందులోకి అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించరు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనువుగా ఉంటే పులి ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలో.. పాలకుర్తి(రామగుండం): మండల పరిధిలో శుక్రవారం పుట్నూర్ గ్రామంలోని అల్లం రవి పొలంలో పెద్దపులు పాదముద్రలు కనిపించగా, శనివారం ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలోని ముత్యాల లింగయ్య పొలం వద్ద పాద ముద్రలను బోడగుట్టపల్లి గ్రామస్తులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా రామగుండం సెక్షన్ అధికారి రహ్మతుల్లా వచ్చి పరిశీలించి పెద్దపులివే అని నిర్ధారించారు. నాగులగుట్ట సమీపంలోని పత్తి చేలల్లో కూడా పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. బుధవారం కన్నాల గ్రామ శివారులోని నాగుల గుట్ట నుంచి రాఘావాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని గుప్తా కోల్వాషరీష్ మీదుగా ఎస్సారెస్పీ డి–83 కాలువ వెంబడి పయనించి బుగ్గగుట్టకు చే రుకుని అక్కడి నుంచి ఈసాలతక్కళ్లపల్లి మీదుగా పుట్నూర్ గ్రామ శివారుకు గురువారం రాత్రి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం బుగ్గగుట్ట నుంచి కుందనపల్లి ఐవోసీ ఇంధన నిల్వల కేంద్రాల సమీపం నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతానికి వచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. -
‘ఏఎల్పీ’లో విష వాయువు!
సింగరేణికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మూడోప్యానెల్ ఏర్పాటుకు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. గనిలో బొగ్గు నిల్వలు పూర్తయిన రెండో ప్యానెల్లో విషవాయువుల తీవ్రత అదుపులోకి రాలేదు. ప్యానెల్లో బొగ్గుకు మంటలంటుకోవడంతో కార్బన్‌మోనాక్సైడ్(సీఓ) విషవాయువులు పెరిగిపోయాయి. మే 4న రెస్క్యూ సిబ్బంది సహాయంతో ప్యానెల్‌కు గోడలు కట్టి మూసివేశారు. అదే ప్యానెల్లో ఉన్న బొగ్గుకు ఆక్సిజన్ తగలకుండా ప్యానెల్‌కు సమాంతరంగా బోర్వెల్స్వేసి సీఓటూ, నైట్రోజన్ పంపించారు. ఈ క్రమంలో ఈనెల 2న ప్యానెల్‌ను తిరిగి ఓపెన్ చేశారు. గోదావరిఖని(రామగుండం): రెండు నెలల అనంతరం గనిలోని రెండో ప్యానెల్‌ను రెస్క్యూ సిబ్బంది సాయంతో ఈనెల 2న తెరిచారు. మొదటి రెండు రోజుల్లో ప్యానెల్లో విషయవావుల ప్రభావం కన్పించలేదు. మూడో రోజు ఆదివారం నుంచి విషయవావులు పెరగడంతో బొగ్గు చల్లారనట్లుగా భావిస్తున్నారు. ఈక్రమంలో మండుతున్న బొగ్గు పొరలపై నీటిని చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రూ. 145కోట్ల విలువైన చాక్స్ సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లో అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్టులో రెండు ప్యానెళ్లలో బొగ్గును విజయవంతంగా వెలికితీశారు. మూడో ప్యానెల్ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్న క్రమంలో రెండో ప్యానెల్లో ఉన్న యంత్రాలను మూడో ప్యానెల్లోకి తరలించేందుకు నిర్ణయించారు. ఈక్రమంలో లాంగ్వాల్ యంత్రానికి సంబంధించి మిగితా భాగాలు తరలించారు. హైడ్రాలిక్ చాక్స్ మాత్రం అందులోనే ఉండిపోయాయి. అందులో ఉన్న విషవాయులను అరికట్టేందుకు మే 4న ప్యానెల్‌కు గోడ పెట్టి మూసివేశారు. దీంతో రూ.145కోట్ల విలువచేసే 145హైడ్రాలిక్ చాక్స్ అందులోనే ఉండిపోయింది. విషవాయుల తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి ప్రాపర్టీని వెలికితీయాలనే ఆలోచనతో యాజమాన్యం వేచి చూసింది. ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో మూసివేసిన గోడలను తిరిగి ఓపెన్ చేశారు. ప్యానెల్లో మళ్లీ మొదలైన మంటలు.. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మూసివేసిన రెండో ప్యానెల్‌ను ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో తెరిచారు. మొదటి రెండు రోజులు బాగానే ఉన్నప్పటికి మూడో రోజునుంచి అందులోంచి మళ్లీ వేడి రావడంతో పాటు విషయవాయువుల తీవ్రతను గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. అందులో ఉన్న చాక్స్‌ను తొలగిస్తూ మంటలను అరికట్టే పనిలో నిమగ్నమైయ్యారు. అయితే తొందరపడి ప్యానెల్ గోడలు తొలగించారని దీంతో పాత పరిస్థితి పునరావృతం అయ్యిందని నిపుణులు అంటున్నారు. మరికొన్ని రోజులు ప్యానెల్ మూసివేసి ఉంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ కంట్రోల్ చేస్తూ చాక్స్ వెలికితీస్తాం: అధికారులు మూసివేసిన ప్యానెల్ తెరిచిన మాట వాస్తవమేనని, అందులో 145 హైడ్రాలిక్ చాక్స్ ఉన్నాయని, ప్యానెల్లో ఉన్న వేడిని తగ్గిస్తూ చాక్స్‌ను బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు తెలిపారు. గనిలోని ప్యానెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఒకవైపు మంటల తీవ్రతను తగ్గిసూ్తనే రోజుకు నాలుగుచొప్పున హైడ్రాలిక్ చాక్స్కు బయటకు తీస్తామని తెలిపారు. మరీ అదుపులోకి రాకుంటే తిరిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన అధికారులు రెస్క్యూ, వైద్య సిబ్బంది గనిపై నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. -
బీఎంఎస్‌ను తీర్చిదిద్దాలి
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): సింగరేణిలో భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్)ను పటిష్టంగా తీర్చిదిద్దాలని, కెంగర్ల మల్లయ్య పూర్తి బాధ్యతలు తీసుకుని సంస్థ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో సంఘాన్ని బలోపేతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీహాలులో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలపై గంటకు పైగా అసెంబ్లీలో మాట్లాడానన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులే లేరని చెప్పారని, దీంతో వాస్తవాలు తెలుసుకునేందుకు సింగరేణిలో అన్నిగనులు పర్యటించానన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాటల గారడీతో కార్మికులను మభ్యపెట్టి కాలం వెల్లదీస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు అందరికన్నా ముందున్నారని కొనియాడారు. తెలంగాణా వస్తే న్యాయం జరుగుతుందని, కార్మికుడికి గౌరవం పెరుగుతుందని భావించారు కానీ అన్నింటా అన్యాయమే జరిగిందన్నారు. నిమ్స్‌లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెంలలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. జెన్కో ఇవ్వాల్సిన సుమారు రూ. 8నుంచి రూ.10వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదన్నారు. కనీసం డాక్టర్లను కూడా పెట్టుకోలేని పరిస్థితి సింగరేణిలో ఉందన్నారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ఏమైపోయిందన్నారు. సింగరేణి కార్మిక సంఘాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికులను ఎందుకు పర్మనెంట్ చేయలేదని ప్రశ్నింన్నారు. బీఎంఎస్‌ను బలోపేతం చేయాలి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కార్మికులకు అండగా నిలబడతా తప్ప ప్రభుత్వానికి వత్తాసు పలకనన్నారు. యూనియన్‌లో చేరిన కెంగర్ల మల్లయ్య పూర్తి బాధ్యతలు తీసుకుని సంఘాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. సింగరేణి యాజమాన్యాన్ని కార్మికులను వేధించాలను కున్నా, భయపెట్టాలనుకున్నా కేంద్రంలో ఆషామాషీ ప్రభుత్వం లేదని, కార్మికులకు అండగా నిలబడతానన్నారు. తెలంగాణలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీరు చెల్లించిన ఇన్‌కంటాక్స్ తిరిగి చెల్లించేలా చేస్తానన్నారు. బీఎంఎస్ వేజ్‌బోర్డు సభ్యులు బీకేరాయ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీఎంఎస్ నాయకులు చింతల సూర్యనారాయణ, మల్లేశం, మాధవనాయక్, బి వనిత, లట్టి జగన్మోహన్రావు, పులి రాజిరెడ్డి, బిలక్ష్మీనారాయణ, కెంగర్ల మల్లయ్య, మాదాసు రాంమూర్తి పాల్గొన్నారు. బీఎంఎస్‌లో చేరిన కెంగర్ల టీబీజీకేఎస్ మాజీ నాయకులు ఉన్న కెంగర్ల మల్లయ్య సోమవారం బీఎంఎస్‌లో చేరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీఎంఎస్ వేజ్‌బోర్డు సభ్యుడు బీకేరాయ్ కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. సోమవారం గోదావరిఖనిలోని సింగరేణి కమ్యూనిటీ హాలులో జరిగిన సభలో బీఎంఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో బీఎంఎస్ కండువాలను కప్పుకున్నారు. మల్లయ్యతో పాటు మాదాసు రాంమూర్తి, అప్పాని శ్రీనివాస్, సంపత్‌రావు, నాగెల్లి సాంబయ్య, నాచగోని దశరథంగౌడ్, గాజుల తిరుపతి, నరేంద్రబాబు, వై.సారంగపాణి, పర్లపల్లి రవీందర్, అర్కాల ప్రసాద్, దాసరి శంకర్, పూర్ణ సత్యనారాయణ, ముక్కెర సుధాకర్, మణుగూరు మల్లేష్, ఆరుట్ల మాధవరెడ్డి, బొల్లెద్దుల ప్రభాకర్, పెర్క సత్యనారాయణ, గోపి, అమరకొండ రాజయ్య, తాళ్లపెల్లి రామయ్య, ఎండీ రఫీస్, సుంకర విజయ్, రమేష్, వాసర్ల జోషఫ్తో పాటు 11 ఏరియాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఎంఎస్‌లో చేరారు. భూగర్భ గనుల జాడలేకుండా పోయింది సింగరేణిలో భూగర్భ గనుల జాడే లేకుండా పోయిందన్నారు. ఉద్యోగాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయన్నారు. కార్మికుల పిల్లలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, యాజమాన్యంపైన ఉందన్నారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కార్మికులు కన్నతల్లిగా కాపాడుకుంటున్నారని అన్నారు. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానినికి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం పెరిగిపోయిందన్నారు. చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలన్నారు. -
కార్మికులకు పదో వేజ్‌బోర్డ్ ఏరియర్స్
సాక్షి, గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు (ఎన్సీడబ్ల్యూఏ) 10వ వేజ్‌బోర్డ్‌కు సంబంధించిన ఏరియర్స్‌లో 70 శాతం ఈ నెల 14న చెల్లించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ వేజ్‌బోర్డ్ వేతనాలు 2016 జూలై 1 నుంచి అమలులోకి రాగా, కంపెనీ నవంబర్ 2017 నుంచి కొత్త జీతాలను చెల్లిస్తూ వస్తోంది. కాగా జూలై 2016 నుంచి అక్టోబర్ 2017 మధ్య గల 16 నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను కంపెనీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.51 వేలను ఏరియర్స్‌లో భాగంగా 2017 అక్టోబర్ 17న కంపెనీ కార్మికులకు చెల్లించింది. అయితే కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ వేజ్‌బోర్డుకు సంబంధించి ఏరియర్స్‌లో 70 శాతం మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ తాజాగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి గతంలో చెల్లించిన రూ.51 వేల ఏరియర్స్‌ను, ఇన్‌కమ్‌ట్యాక్స్, సీఎంపీఎఫ్ సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల బ్యాంకు అకౌంట్లలో ఈ నెల 14న జమ చేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీని కోసం కంపెనీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. మిగిలిన 30 శాతం ఏరియర్సును కోల్ ఇండియా స్థాయిలో తీసుకునే నిర్ణయం మేరకు కంపెనీ చెల్లిస్తుందని యాజమాన్యం తెలిపింది. -
ఏటీఎం కేంద్రంలో యువకుడి హత్య
కోల్‌సిటీ (రామగుండం): ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మారుతీనగర్‌కు చెందిన బైకనవేని శ్రీనివాస్(26) క్యాటరింగ్, పాల వ్యాపారం చేస్తున్నాడు. ఇంటికి సమీపంలోని అడ్డగుంటపల్లిలో ఉండే కనవేణి రమేశ్, ఆయన సోదరుడు సురేశ్‌ను క్యాటరింగ్‌కు తీసుకెళ్తుండేవాడు. ఇటీ వల మనస్పర్ధల కారణంగా వారిని తీసుకెళ్లడం మానేయడంతో సురేశ్ కక్ష పెంచుకున్నాడు. శనివారం శ్రీనివాస్ తన తల్లి వితంతు పింఛన్ డబ్బును డ్రా చేసేందుకు సమీపంలోని ఏటీఎంకు వెళ్లాడు. అకస్మాత్తుగా ఏటీఎంలోకి చొరబడిన సురేశ్ రోకలిబండతో శ్రీనివాస్ తలపై మోదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. -
11న తమిళనాడు గవర్నర్ రోశయ్య రాక
గోదావరిఖని : ఈ నెల 11న గోదావరిఖనిలో జరిగే ఆర్యవైశ్య మహాసభ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరవుతున్నారని మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, సదస్సు కన్వీనర్ కోలేటి దామోదర్ తెలిపారు. స్థానిక అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఆరు జిల్లాలకు చెందిన వైశ్య ప్రముఖులతో సోమవారం సమావేశం జరిగింది. గోదావరిఖని ఆర్జీ–1 కమ్యూనిటీహాల్లో నిర్వహించే సదస్సుకు మంత్రి ఈటల రాజేందర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గణేష్‌గుప్తా, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణతదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని చెప్పారు. ఓసీలలో ఉన్న పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ రాయితీలు వర్తింపచేయాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. వైశ్యుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు, కోశాధికారి జి.మల్లికార్జున్, వివిధ జిల్లాల బాధ్యులు రాజన్న, యాద అంజయ్య, నర్సిన సంతోష్, చిదురాల రవీందర్, నాగన్న, జగన్మోహన్, అశోక్, వైకుంఠం, కాంతయ్య, విజయ్‌కుమార్, బల్లు చంద్రప్రకాష్ గుప్తా, వెనిశెట్టి నటరాజశేఖర్, గుండా లక్ష్మికాంతం, శ్రీనివాస్ పాల్గొన్నారు.