పాద ముద్రలను కొలుస్తున్న అటవీశాఖ అధికారులు
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పక్షం రోజులుగా జిల్లాలో తిరుగుతున్న పులి అనువైన ఆవాసం దొరకక ప్రయాణం కొనసాగిస్తోంది. జిల్లాలో రోజుకో ప్రాంతంలో అడుగులు దర్శనమిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో అడుగులు కనిపించిన ప్రాంతానికి అటవీశాఖ అధికారులు చేరుకుని పులివే అని నిర్ధారించి వదిలేస్తున్నారు. పులిని పట్టుకుని తరలించే ప్రయత్నంకానీ, అనువైన ఆవాసం కల్పించే ప్రయత్నంకానీ, జిల్లా దాటించే ప్రయత్నం కానీ చేయడం లేదు. దీంతో ప్రజలు ఏరోజు ఎక్కడ పులిని చూడాల్సి వస్తుందో.. ఎవరిపై దాడిచేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
ఆరు మండలాల్లో సంచారం..
ఈనెల 7వ తేదీన ముత్తారం మండలం ఓడేడు శివారులో భూపాల పల్లి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రయాణం నిరంతరం కొనసాగిస్తోంది. ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పెద్దపల్లి, పాలకుర్తి మండలాల మీదుగా, రామగుండం మండలం ఎన్టీపీసీ రిజర్వాయర్ వరకు సాగింది. అయితే ముత్తారం మండలం మచ్చుపేట శివారులోని బగుళ్ల గుట్ట అడవుల్లో ఆవుల మందపై దాడిచేసిన సమయంలో మాత్రమే పెద్దపులి పశువుల యజమానికి కనిపించింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మంథని–పెద్దపల్లి రహదారి మీదుగా కారులో వెళ్తున్న యువకులు పులి రోడ్డు దాటుతుండగా చూశామని చెబుతున్నారు. ఈరెండేసార్లు మినహా ఎక్కడా ఎవరికీ పులి కనిపించలేదు. బగుళ్ల గుట్టవద్ద మినహా ఎక్కడా పశువులకు, మనుశులకు ఎలాంటి హాని తలపెట్టకుండా తన ప్రయాణం కొనసాగిస్తోంది.
ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపంలో పాద ముద్రలు
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. పుట్నూరు ప్రాంతంలో నుంచి పులి శనివారం తెల్లవారుజామున బుగ్గ గుట్ట మీదుగా భామ్లా నాయక్ తండా గుండా ఎన్టీపీసీ రిజర్వాయర్ అటవి ప్రాంతానికి చేరుకుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంధన నిల్వల కేంద్రం, గాడిదల గండి వైపు వెళ్లిందని అడుగుల ఆధారంగా గుర్తించామని అటవీ శాఖ సెక్షన్ అధికారి రహ్మతుల్లా, బీట్ అధికారులు నరేశ్, రమేశ్ వివరించారు. వీరితోపాటు భీమ్లా నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ కూడా ఉన్నారు.
రాజీవ్ రహదారి ఎలా దాటింది..?
పులి పుట్నూరు నుంచి బుగ్గ గుట్ట మీదుగా ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిని దాటాలి. రోడ్డు దాటే క్రమంలో ఎవరికీ కనిపించకపోవడం ప్రశ్నగా మారింది. పులి సంచరించినట్లు తెలు పుతున్న అధికారులు పులి ఏ వైపుకు వెళుతుందో.. అటవీ ప్రాంతం వివరాలు అధికారులకు తెలిసినా రాత్రి సమయంలో కాపు కాయకపోవడంతోనే పులి సంచారాన్ని కనుక్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పులి బుగ్గ గుట్ట నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వెళ్లిందా అనే విషయాలపై కూడా పూర్తి స్పష్టత కనిపించడం లేదు.
రెండేళ్ల క్రితం కూడా పులి సంచారం..
ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలోకి 2018, జూన్‌లో రెండు పులులు సంచిరించినట్లు అధికారులు ధ్రువీకరించారు. రెండు పులులలో ఒకటి చిన్నది, మరొకటి పెద్దదిగా ఉన్నాయని పాద ముద్రల ఆధారంగా నిర్ధారించారు. ఆ తర్వాత పులులు ఎటు వెళ్లాయో కూడా పూర్తి సమాచారం లేదు. రెండేళ్ల వచ్చిన చిన్న పులి పెరిగి పెద్ద అయి మళ్లీ ఈ ప్రాంతంలో సంచరిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతం పూర్తి రక్షిత ప్రాంతం అందులోకి అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించరు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనువుగా ఉంటే పులి ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలో..
పాలకుర్తి(రామగుండం): మండల పరిధిలో శుక్రవారం పుట్నూర్ గ్రామంలోని అల్లం రవి పొలంలో పెద్దపులు పాదముద్రలు కనిపించగా, శనివారం ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలోని ముత్యాల లింగయ్య పొలం వద్ద పాద ముద్రలను బోడగుట్టపల్లి గ్రామస్తులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా రామగుండం సెక్షన్ అధికారి రహ్మతుల్లా వచ్చి పరిశీలించి పెద్దపులివే అని నిర్ధారించారు. నాగులగుట్ట సమీపంలోని పత్తి చేలల్లో కూడా పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. బుధవారం కన్నాల గ్రామ శివారులోని నాగుల గుట్ట నుంచి రాఘావాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని గుప్తా కోల్‌వాషరీష్ మీదుగా ఎస్సారెస్పీ డి–83 కాలువ వెంబడి పయనించి బుగ్గగుట్టకు చే రుకుని అక్కడి నుంచి ఈసాలతక్కళ్లపల్లి మీదుగా పుట్నూర్ గ్రామ శివారుకు గురువారం రాత్రి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం బుగ్గగుట్ట నుంచి కుందనపల్లి ఐవోసీ ఇంధన నిల్వల కేంద్రాల సమీపం నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతానికి వచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment