- రూ.10 లక్షలు డ్రా చేయడానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
- పరారీలో నిందితుడు
కాచిగూడ: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి భార్య కావ్య సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ సంతకంతో బ్యాంకు నుంచి రూ.10 లక్షలు డ్రా చేయడానికి యత్నించిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ క్రైం ఎస్‌ఐ బీవీ కౌశిక్ తెలిపిన వివరాలు.. ఎర్రమంజిల్ కాలనీలోని నీమా ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ కంపెనీ యజమాని రాజశేఖర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వద్ద పనిచేస్తుండేవాడు.
కిషన్‌రెడ్డి భార్య కావ్వకు పంజగుట్టలోని ఆంధ్రా బ్యాంకులో అకౌంట్ ఉంది. కావ్య ఇచ్చినట్లుగా ఓ వ్యక్తి ఈ నెల 30వ తేదీన రూ.10 లక్షల చెక్కును డ్రా చేయడానికి బ్యాంకులో ఉన్న డ్రాప్ బాక్స్‌లో వేశాడు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కావ్య దృష్టికి తీసుకువచ్చారు. తాను ఎవరికి రూ.10 లక్షల చెక్కు ఇవ్వలేదని తెలిపారు. చెక్కు కోసం ఎవరైనా వస్తే తమ దృష్టికి తీసుకురావాలని బ్యాంకు అధికారులకు తెలియజేశారు.
ఈ విషయమై కాచిగూడ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. చెక్కు స్టేటస్ తెలుసుకోవడానికి రాజశేఖర్‌రెడ్డి వద్ద పనిచేస్తున్న బండారి అనంద్ క్రాంతి కుమార్ బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులు కాచిగూడ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే కాచిగూడ పోలీసులు బొల్లారం రిసాలబజార్ ప్రాంతానికి చెందిన బండారి అనంద్ క్రాంతి కుమార్ (30)ను అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కావ్య సంతకాన్ని ఫోర్జరీ చేసిన రాజశేఖర్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.