ఫిర్యాదుపై దర్యాప్తును మేజిస్ట్రేట్ పర్యవేక్షించొచ్చు | Kothagudem Magistrate can be Inspected on complaint investigation | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుపై దర్యాప్తును మేజిస్ట్రేట్ పర్యవేక్షించొచ్చు

Published Wed, May 27 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

ఫిర్యాదుపై దర్యాప్తును మేజిస్ట్రేట్ పర్యవేక్షించొచ్చు

ఫిర్యాదుపై దర్యాప్తును మేజిస్ట్రేట్ పర్యవేక్షించొచ్చు

కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఉత్తర్వులలో తప్పేంలేదు
ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ప్రైవేటు ఫిర్యాదుపై దర్యాప్తునకు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసినప్పుడు, ఆ దర్యాప్తును పర్యవేక్షించే అధికారం సదరు మేజిస్ట్రేట్‌కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అందులో భాగంగా నిందితునిపై అదనంగా మరిన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించవచ్చునని తేల్చి చెప్పింది. కొత్తగూడెం మొదటి అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ (ఏజెఎంఎఫ్‌సీ) పోలీసులను కోరడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏజెఎంఎఫ్‌సీ చేసింది ఎంత మాత్రం తప్పుకాదని తేల్చింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు ఇటీవల తీర్పునిచ్చారు. బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఎ.కనకరాజ్, ఎం.రాజిరెడ్డి, వై.సారంగపాణి కార్మికుల సంక్షేమం కోసం నెలనెలా వసూలు చేసిన రూ.91.06 లక్షలు దుర్వినియోగం చేశారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ జి.కె.సంపత్‌కుమార్ కొత్తగూడెం మొదటి ఏజెఎఫ్‌ఎం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిని విచారించిన మేజిస్ట్రేట్, ఈ ఫిర్యాదును కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులకు నివేదిస్తూ, దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా సంపత్‌కుమార్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. విశ్వాస ఘాతుకానికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 409, ఖాతాలను తారుమారు చేసినందుకు సెక్షన్ 477ఎ కింద కూడా దర్యాప్తు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.
 
 ఈ రెండు సెక్షన్ల కింద కూడా దర్యాప్తు చేయాలని పోలీసులను మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీనిని సవాలు చేస్తూ కనకరాజ్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పు చెబుతూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద పోలీసుల దర్యాప్తునకు ఆదేశించిన కేసుల్లో దానిని పర్యవేక్షించే అధికారం సంబంధిత మేజిస్ట్రేట్‌కుందన్నారు. అయితే ఈ అధికారాన్ని జాగ్రత్తగా, న్యాయబద్ధంగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement