మాట్లాడుతున్న జస్టిస్ దుర్గాప్రసాదరావు
తణుకు టౌన్: సకల శాస్త్రాలకు మన ప్రాచీన వేదాలే మూలమని.. న్యాయశాస్త్రానికి కూడా వేద విజ్ఞానమే మాతృక అనిరాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని శ్రీ పర్వత వర్దని సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వేదశాస్త్ర పండిత సత్కార సభ 13వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిర్రావూరి శ్రీరామచంద్రశర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ.. వేదం శాస్త్రీయత కలిగిన శాస్త్రమని, ఇది మానవుని గురించి సమగ్రంగా చర్చించిన శాస్త్రమని చెప్పారు.
వేదాలే ప్రపంచానికి మార్గనిర్దేశం చేశాయని, వేద విజ్ఞానంపై ప్రతి ఒక్కరూ గౌరవభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చిర్రావూరి శివరామకృష్ణ రాసిన ‘వేదవేదాంగ నివేదన’ పుస్తకాన్ని శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి గంభీరానంద స్వామీజీ, హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, హైకోర్టు న్యాయవాదులు చల్లా ధనుంజయ, డాక్టర్ శాస్త్రి జంధ్యాల, వేద పండితులు కడియాల సీతారామ ఘనాపాటి, దోర్భల ప్రభాకరశర్మ, విశ్వనాథం గోపాలకృష్ణ, తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్, ఎంపీపీ రుద్రా ధనరాజు, గ్రామ సర్పంచ్ అడాడ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ కోనాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీ పర్వత వర్దని సమేత నాగేశ్వరస్వామి వారిని జస్టిస్ దుర్గాప్రసాదరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment