Durga prasada rao
-
తెనాలిలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా నిర్మించిన ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు’ ను బుధవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప హాజరయ్యారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ..మైనార్టీ తీరని మహిళలపై జరిగే అత్యాచారాలను అత్యంత త్వరితగతిన విచారణ జరిపించి బాధితులకు న్యాయం, నేరస్తులకు తగిన శిక్ష పడేలా చూడాలని అటు ప్రభుత్వం, ఇటు న్యాయస్థానాలు భావిస్తున్నాయని చెప్పారు. పోక్సో నేరాలను తీవ్రమైనవిగా పరిగణించి సత్వర న్యాయం చేయాలన్న సంకల్పంతో సాధ్యమైనన్ని ఎక్కువ పోక్సో కోర్టులను అవసరమైన ప్రదేశాల్లో నెలకొల్పుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గుంటూరులో పోక్సో కోర్టు ఉన్నప్పటికీ తెనాలిలో కూడా మరో పోక్సో కోర్టును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఇక్కడ 16 మండలాలకు సంబంధించిన పోక్సో కేసులను విచారణ చేస్తారని చెప్పారు. -
సకల శాస్త్రాలకు మాతృక వేద విజ్ఞానమే
తణుకు టౌన్: సకల శాస్త్రాలకు మన ప్రాచీన వేదాలే మూలమని.. న్యాయశాస్త్రానికి కూడా వేద విజ్ఞానమే మాతృక అనిరాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని శ్రీ పర్వత వర్దని సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వేదశాస్త్ర పండిత సత్కార సభ 13వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిర్రావూరి శ్రీరామచంద్రశర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ.. వేదం శాస్త్రీయత కలిగిన శాస్త్రమని, ఇది మానవుని గురించి సమగ్రంగా చర్చించిన శాస్త్రమని చెప్పారు. వేదాలే ప్రపంచానికి మార్గనిర్దేశం చేశాయని, వేద విజ్ఞానంపై ప్రతి ఒక్కరూ గౌరవభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చిర్రావూరి శివరామకృష్ణ రాసిన ‘వేదవేదాంగ నివేదన’ పుస్తకాన్ని శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి గంభీరానంద స్వామీజీ, హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, హైకోర్టు న్యాయవాదులు చల్లా ధనుంజయ, డాక్టర్ శాస్త్రి జంధ్యాల, వేద పండితులు కడియాల సీతారామ ఘనాపాటి, దోర్భల ప్రభాకరశర్మ, విశ్వనాథం గోపాలకృష్ణ, తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్, ఎంపీపీ రుద్రా ధనరాజు, గ్రామ సర్పంచ్ అడాడ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ కోనాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీ పర్వత వర్దని సమేత నాగేశ్వరస్వామి వారిని జస్టిస్ దుర్గాప్రసాదరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
ఎవరా ఇద్దరు?
సాక్షి, సిటీబ్యూరో: రైల్వేలో ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వంద మంది నిరుద్యోగుల ముంచి రూ.కోట్లు దండుకున్న ఘరానా మోసగాడు పమ్మిడి దుర్గా ప్రసాద్ రావు కేసులో సీసీఎస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏకంగా భార్యతో కలిసే మోసాలు చేసిన ఇతగాడిపై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదై ఉండగా... మరికొన్నింటిలో ఇతడి ప్రమేయాన్ని అనుమానిస్తున్నారు. దుర్గా ప్రసాద్‌ను గత నెలలో అరెస్టు చేసిన విషయం విదితమే. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న ఇతను నిత్యం సీసీఎస్‌లో హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే లోతుగా ప్రశ్నించగా... ఢిల్లీకి చెందిన ఇద్దరు తనకు సహకరించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం వారి కోసం దర్యాప్తు అధికారులు ముమ్మరంగా వేటాడుతున్నారు. మరోపక్క సోమవారం సీసీఎస్ పోలీసులు కొందరు బాధితులను వెంట పెట్టుకుని లాలాగూడలోని రైల్వే ఆస్పత్రి, సికింద్రాబాద్‌లోని రైల్ నిలయాలకు వెళ్లి దర్యాప్తు చేసి వచ్చారు. కన్స్ట్రక్షన్స్ వదిలి మోసాల వైపు... ఎమ్మెల్యే కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్ మాజీ సైనికోద్యోగి కావడంతో పాటు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. అయితే తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన భార్య పద్మినితో కలిసి మోసాలకు శ్రీకారం చుట్టాడు. రైల్వేలో తనకు ఉన్న పరిచయాలు వినియోగించుకుని దొడ్డిదారిన గ్రూప్ సి,డితో పాటు స్టేషన్ మాస్టర్, టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఆసక్తి చూపిన వారి నుంచి అడ్వాన్స్‌గా రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. వీరిలో కొందరితో బోగస్ పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు రైల్వే ఉద్యోగాలకు వైద్య పరీక్షలు తప్పనిసరిగా పేర్కొంటూ కొందరు అభ్యర్థులను లాలగూడలోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లి రక్త, మూత్ర పరీక్షలు చేయించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇంకా ఎందుకు రాలేదంటూ నిలదీయగా, తన భార్య సహకారంతో వారిని సికింద్రాబాద్‌లోని రైల్ నిలయానికి పంపాడు. అక్కడ ఓ ప్రాంతంలో వీరిని కూర్చోబెట్టిన పద్మిని ఈ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్లు వస్తాయని నమ్మబలికింది. ఈ వ్యవహారాలు సాగించడానికి రైల్వే ఆస్పత్రి, రైల్ నిలయంలో పని చేసే కొందరు సహకరించినట్లు సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాలు దుర్గా ప్రసాద్ బయటపెట్టకపోవడంతో వారిని గుర్తించడం కోసం సోమవారం కొందరు బాధితులతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు లోతుగా ఆరా తీయడంతో పాటు అనుమానితులను గుర్తించాల్సిందిగా బాధితులను కోరగా, అప్పట్లో తమను కలిసిన వారు ఇప్పుడు కనిపించలేదని బాధితులు చెప్పినట్లు తెలిసింది. మరో ఇద్దరికి వాటాలు... నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు గత నెల్లోనే కోర్టులో హాజరుపరిచారు. ఇతడికి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారంలో నిర్ణీత రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని, కేసు దర్యాప్తునకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది. సీసీఎస్‌కు వస్తున్న దుర్గాప్రసాద్ పోలీసులకు ఈ స్కామ్‌లో ఢిల్లీకి చెందిన ఇద్దరికి వాటాలు ఉన్నట్లు చెప్పాడు. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్ములో కొంత వారికీ అందించానన్నాడు. అయితే వారి వివరాలు మాత్రం తనకు తెలియవని చెప్తున్నాడు. మరోపక్క ఇతడి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, మాజీ సైనికోద్యోగి కావడంతో పెన్షన్‌కు సంబంధించిన ఖాతా తదితరాలను సీసీఎస్ పోలీసులు పరిశీలించారు. అయితే వీటిలో ఎక్కడా నేరం మొదలైన నాటి నుంచి నేటి వరకు సరైన ఆర్థిక లావాదేవీలు లేవు. దీనిపై అతగాడు సరైన సమాధానం చెప్పట్లేదు. దీంతో ఇతడితో పాటు కుటుంబీకుల పేరుతో ఉన్న స్థిరాస్తుల వివరాలు తెలపాల్సిందిగా కోరుతూ రిజిస్ట్రేషన్స్ శాఖకు లేఖ రాశారు. ఢిల్లీకి చెందిన ఆ ఇద్దరు ఎవరనేది కనిపెట్టి, పట్టుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. దుర్గాప్రసాద్ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదని, అనేక విషయాలు దాస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. దీని ప్రకారం అతడు బెయి ల్ షరతుల్ని ఉల్లంఘిస్తున్నాడని ఈ నేపథ్యంలోనే బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నారు. స్పందించని ఇతర పోలీసు విభాగాలు... దుర్గా ప్రసాద్ కేసును సీసీఎస్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడికి మరికొన్ని కేసులతోనూ సంబంధం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే నమోదై ఉన్న మూడింటితో పాటు పాటు మరో ఏడు కేసుల్లో పరోక్షంగా ప్రమేయం కలిగి ఉన్నాడని భావిస్తున్నారు. ఆయా స్కామ్స్‌లో సూత్రధారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులకు బియ్యం తదితరాలు తక్కువ ధరకు ఇప్పిస్తామని, బంగారం వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేసిన నేరగాళ్లతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే ఆయా కేసులన్నీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవి. దీంతో దుర్గాప్రసాద్ అరెస్టు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన లింకుల్ని వివరిస్తూ స్థానికంగా ఆరా తీయాల్సిందిగా కోరుతూ సీసీఎస్ పోలీసులు సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. అయితే నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎవరి నుంచి సరైన స్పందన రాలేదు. -
ఫిర్యాదుపై దర్యాప్తును మేజిస్ట్రేట్ పర్యవేక్షించొచ్చు
కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఉత్తర్వులలో తప్పేంలేదు ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఏదైనా ప్రైవేటు ఫిర్యాదుపై దర్యాప్తునకు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసినప్పుడు, ఆ దర్యాప్తును పర్యవేక్షించే అధికారం సదరు మేజిస్ట్రేట్‌కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అందులో భాగంగా నిందితునిపై అదనంగా మరిన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించవచ్చునని తేల్చి చెప్పింది. కొత్తగూడెం మొదటి అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ (ఏజెఎంఎఫ్‌సీ) పోలీసులను కోరడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏజెఎంఎఫ్‌సీ చేసింది ఎంత మాత్రం తప్పుకాదని తేల్చింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు ఇటీవల తీర్పునిచ్చారు. బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఎ.కనకరాజ్, ఎం.రాజిరెడ్డి, వై.సారంగపాణి కార్మికుల సంక్షేమం కోసం నెలనెలా వసూలు చేసిన రూ.91.06 లక్షలు దుర్వినియోగం చేశారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ జి.కె.సంపత్‌కుమార్ కొత్తగూడెం మొదటి ఏజెఎఫ్‌ఎం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిని విచారించిన మేజిస్ట్రేట్, ఈ ఫిర్యాదును కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులకు నివేదిస్తూ, దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా సంపత్‌కుమార్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. విశ్వాస ఘాతుకానికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 409, ఖాతాలను తారుమారు చేసినందుకు సెక్షన్ 477ఎ కింద కూడా దర్యాప్తు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ రెండు సెక్షన్ల కింద కూడా దర్యాప్తు చేయాలని పోలీసులను మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీనిని సవాలు చేస్తూ కనకరాజ్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పు చెబుతూ.. సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద పోలీసుల దర్యాప్తునకు ఆదేశించిన కేసుల్లో దానిని పర్యవేక్షించే అధికారం సంబంధిత మేజిస్ట్రేట్‌కుందన్నారు. అయితే ఈ అధికారాన్ని జాగ్రత్తగా, న్యాయబద్ధంగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు.