ఎవరా ఇద్దరు? | Twist in Cheating Case Durga Prasad Rao | Sakshi
Sakshi News home page

ఎవరా ఇద్దరు?

Published Tue, Jan 8 2019 10:42 AM | Last Updated on Tue, Jan 8 2019 10:42 AM

Twist in Cheating Case Durga Prasad Rao - Sakshi

దుర్గా ప్రసాద్‌ రావు

సాక్షి, సిటీబ్యూరో: రైల్వేలో ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వంద మంది నిరుద్యోగుల ముంచి రూ.కోట్లు దండుకున్న ఘరానా మోసగాడు పమ్మిడి దుర్గా ప్రసాద్‌ రావు కేసులో సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏకంగా భార్యతో కలిసే మోసాలు చేసిన ఇతగాడిపై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదై ఉండగా... మరికొన్నింటిలో ఇతడి ప్రమేయాన్ని అనుమానిస్తున్నారు. దుర్గా ప్రసాద్‌ను గత నెలలో అరెస్టు చేసిన విషయం విదితమే. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న ఇతను నిత్యం సీసీఎస్‌లో హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే లోతుగా ప్రశ్నించగా... ఢిల్లీకి చెందిన ఇద్దరు తనకు సహకరించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం వారి కోసం దర్యాప్తు అధికారులు ముమ్మరంగా వేటాడుతున్నారు. మరోపక్క సోమవారం సీసీఎస్‌ పోలీసులు కొందరు బాధితులను వెంట పెట్టుకుని లాలాగూడలోని రైల్వే ఆస్పత్రి, సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయాలకు వెళ్లి దర్యాప్తు చేసి వచ్చారు. 

కన్‌స్ట్రక్షన్స్‌ వదిలి మోసాల వైపు...
ఎమ్మెల్యే కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్‌ మాజీ సైనికోద్యోగి కావడంతో పాటు కన్‌స్ట్రక్షన్‌ రంగంలో ఉన్నాడు. అయితే తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన భార్య పద్మినితో కలిసి మోసాలకు శ్రీకారం చుట్టాడు. రైల్వేలో తనకు ఉన్న పరిచయాలు వినియోగించుకుని దొడ్డిదారిన గ్రూప్‌ సి,డితో పాటు స్టేషన్‌ మాస్టర్, టిక్కెట్‌ కలెక్టర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఆసక్తి చూపిన వారి నుంచి అడ్వాన్స్‌గా రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. వీరిలో కొందరితో బోగస్‌ పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు రైల్వే ఉద్యోగాలకు వైద్య పరీక్షలు తప్పనిసరిగా పేర్కొంటూ కొందరు అభ్యర్థులను లాలగూడలోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లి   రక్త, మూత్ర పరీక్షలు చేయించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు  అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇంకా ఎందుకు రాలేదంటూ నిలదీయగా, తన భార్య సహకారంతో వారిని సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయానికి పంపాడు. అక్కడ ఓ ప్రాంతంలో వీరిని కూర్చోబెట్టిన పద్మిని ఈ కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు వస్తాయని నమ్మబలికింది. ఈ వ్యవహారాలు సాగించడానికి రైల్వే ఆస్పత్రి, రైల్‌ నిలయంలో పని చేసే కొందరు సహకరించినట్లు సీసీఎస్‌ పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాలు దుర్గా ప్రసాద్‌ బయటపెట్టకపోవడంతో వారిని గుర్తించడం కోసం సోమవారం కొందరు బాధితులతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు లోతుగా ఆరా తీయడంతో పాటు అనుమానితులను గుర్తించాల్సిందిగా బాధితులను కోరగా,  అప్పట్లో తమను కలిసిన వారు ఇప్పుడు కనిపించలేదని బాధితులు చెప్పినట్లు తెలిసింది. 

మరో ఇద్దరికి వాటాలు...
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు గత నెల్లోనే కోర్టులో హాజరుపరిచారు. ఇతడికి బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం వారంలో నిర్ణీత రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని, కేసు దర్యాప్తునకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది. సీసీఎస్‌కు వస్తున్న దుర్గాప్రసాద్‌ పోలీసులకు ఈ స్కామ్‌లో ఢిల్లీకి చెందిన ఇద్దరికి వాటాలు ఉన్నట్లు చెప్పాడు. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్ములో కొంత వారికీ అందించానన్నాడు. అయితే వారి వివరాలు మాత్రం తనకు తెలియవని చెప్తున్నాడు. మరోపక్క ఇతడి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, మాజీ సైనికోద్యోగి కావడంతో పెన్షన్‌కు సంబంధించిన ఖాతా తదితరాలను సీసీఎస్‌ పోలీసులు పరిశీలించారు. అయితే వీటిలో ఎక్కడా నేరం మొదలైన నాటి నుంచి నేటి వరకు సరైన ఆర్థిక లావాదేవీలు లేవు. దీనిపై అతగాడు సరైన సమాధానం చెప్పట్లేదు. దీంతో ఇతడితో పాటు కుటుంబీకుల పేరుతో ఉన్న స్థిరాస్తుల వివరాలు తెలపాల్సిందిగా కోరుతూ రిజిస్ట్రేషన్స్‌ శాఖకు లేఖ రాశారు. ఢిల్లీకి చెందిన ఆ ఇద్దరు ఎవరనేది కనిపెట్టి, పట్టుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. దుర్గాప్రసాద్‌ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదని, అనేక విషయాలు దాస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. దీని ప్రకారం అతడు బెయి ల్‌ షరతుల్ని ఉల్లంఘిస్తున్నాడని ఈ నేపథ్యంలోనే బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని యోచిస్తున్నారు. 

స్పందించని ఇతర పోలీసు విభాగాలు...
దుర్గా ప్రసాద్‌ కేసును సీసీఎస్‌ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడికి మరికొన్ని కేసులతోనూ సంబంధం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే నమోదై ఉన్న మూడింటితో పాటు పాటు మరో ఏడు కేసుల్లో పరోక్షంగా ప్రమేయం కలిగి ఉన్నాడని భావిస్తున్నారు. ఆయా స్కామ్స్‌లో సూత్రధారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ షాపులకు బియ్యం తదితరాలు తక్కువ ధరకు ఇప్పిస్తామని, బంగారం వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేసిన నేరగాళ్లతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే ఆయా కేసులన్నీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవి. దీంతో దుర్గాప్రసాద్‌ అరెస్టు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన లింకుల్ని వివరిస్తూ స్థానికంగా ఆరా తీయాల్సిందిగా కోరుతూ సీసీఎస్‌ పోలీసులు సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. అయితే నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎవరి నుంచి సరైన స్పందన రాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement