కృష్ణపట్నం.. డబుల్ దగా
రెండో యూనిట్ ట్రయల్ రన్
ఈ వారం నుంచే ప్రయోగాత్మక ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వాటాల పంపిణీ వ్యత్యాసం పెరిగిపోతోంది. తెలంగాణకు కృష్ణపట్నం నుంచి రావాల్సిన విద్యుత్తు వాటాల లోటు రెండింతలకు పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణపట్నంలో రెండో యూనిట్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. సోమవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వారం నుంచే ఇన్‌ఫర్మ్ పవర్ (ప్రయోగాత్మక దశ) ఉత్పత్తి మొదలవనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం ప్లాంట్‌లో 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఉత్పత్తి కొనసాగుతోంది. మార్చి నుంచి ఇప్పటివరకు అందులో ఒక్క యూనిట్‌నూ తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ అడ్డుకుంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం నుంచి 53.89 శాతం విద్యుత్తు తెలంగాణ డిస్కంలకు రావాల్సి ఉంది. వాటా ప్రకారం మొదటి యూనిట్ విద్యుత్తు రాకపోవటంతో గడచిన తొమ్మిది నెలల్లో దాదాపు రూ.120 కోట్లు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో రెండో యూనిట్ కూడా ప్రారంభమవుతుండటంతో... ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ చేస్తుందా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొండికేస్తే.. విద్యుత్తు వాటాల పంపిణీపై మరింత పట్టు పట్టాలని తెలంగాణ జెన్‌కో, డిస్కం అధికారులు భావిస్తున్నారు. చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు వాటాల పంపిణీ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఇటీవలే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం రెండో యూనిట్‌లో విద్యుదుత్పత్తి ఎటువైపు మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది.