సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించిన విచారణను ట్రిబ్యునల్ మే 4, 5 తేదీలకు వాయిదా వేసింది. తమ స్టేట్‌మెంట్లు దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని గురువారం విచారణ సందర్భంగా అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థించాయి. దీనిపై స్పందించిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి గడువు ఎందుకని ప్రశ్నించింది.
నదీ జలాలకు సంబంధించిన సాంకేతిక పరమైన గణాంకాల వివరాలను నిపుణుల నుంచి ఇంకా పొందాల్సి ఉందని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫు సీనియర్ న్యాయవాదులు ఏకే గంగూలీ, వైద్యనాథన్ నివేదించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరఫు జూనియర్ న్యాయవాది కల్పించుకొని.. నిర్ణీత కాల వ్యవధిలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యకు ముగింపు పలకాల్సి ఉందని, ఇప్పటికే చాలా సమయం ఇచ్చినందున అఫిడవిట్లు దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వకుండా ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని ట్రిబ్యునల్‌ను కోరారు.
ఇందుకు సంబంధించి జల వనరుల శాఖ సెక్షన్ అధికారి తమ సీనియర్ న్యాయవాదికి రాసిన నోట్‌ను ఆయన ట్రిబ్యునల్‌కు సమర్పించారు. దీనిపై ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాలు తమ స్టేట్‌మెంట్లను దాఖలు చేయడానికి ఏప్రిల్ 12 వరకు గడువు ఇచ్చింది. ఏప్రిల్ 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని, మే 2లోపు రీజాయిండర్లు అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, నదీ జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ ఇచ్చే స్టేట్‌మెంట్లను తమకు ఇవ్వాలన్న కర్ణాటక ప్రభుత్వ తరఫు న్యాయవాది వినతిని ట్రిబ్యునల్ తిరస్కరించింది. స్టేట్‌మెంట్లు కావాలంటే ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కృష్ణా జలాలపై విచారణ వాయిదా
Published Fri, Mar 24 2017 1:08 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement