‘వరద’కు శాశ్వత పరిష్కారం | KTR assures to resolve rain water stagnation problem by next monsoon | Sakshi
Sakshi News home page

‘వరద’కు శాశ్వత పరిష్కారం

Published Thu, Nov 16 2017 4:00 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

KTR assures to resolve rain water stagnation problem by next monsoon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భారీ వర్షాలతో హైదరాబాద్‌ నగరంలో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని.. మురుగు కాల్వల నిర్వహణను మెరుగుపర్చుతున్నామని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ‘హైదరాబాద్‌లో డ్రైనేజీ, వరద నీటి సమస్యల’పై ఎమ్మెల్యేలు జాఫర్‌ హుస్సేన్, జి.కిషన్‌రెడ్డి, కౌసర్‌ మొయినుద్దీన్, వివేకానంద్, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. ‘‘జీహెచ్‌ఎంసీలో 1,221 కిలోమీటర్ల పొడవైన వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ మాత్రమే ఉంది. ఇది సరిపోకపోవడంతో వర్షాకాలంలో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడానికి కారణమవుతోంది. చెరువులు, నాలాల ఆక్రమణల కారణంగా ప్రవాహ సామర్థ్యం తగ్గింది.

దీంతో రూ.230 కోట్లతో 47 డ్రైనేజీల్లో అంతరాయాలను తొలగించేందుకు పనులు చేపట్టాం. నీరు నిలిచిపోయే 13 ప్రాం తాలను గుర్తించి చర్యలు చేప ట్టాం. జీహెచ్‌ఎంసీ నిధు లతో 63 చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. మిషన్‌ కాకతీయ నిధులతో మరో 20 చెరువుల అభివృద్ధికి ప్రతి పాదనలు చేశాం. వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండే 346 ముఖ్యమైన రోడ్లను గుర్తించాం. మురుగుకాల్వలు, నాలాల విస్తరణతో నివాసాలు కోల్పోయే పేదలకు పరిహారం ఇస్తున్నాం. వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించనున్నాం. మెట్రో రైల్‌ నిర్మాణం కోసం రోడ్ల మధ్యలో నిర్మిస్తున్న డివైడర్‌ వల్ల వరద నీటి ప్రవాహం ఆగిపోతోంది. దీంతో అవసరమైన చోట డివైడర్లలో ఖాళీలు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వర్షాకాలం నాటికి వరద నీటితో సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం..’’అని కేటీఆర్‌ వివరించారు.

రుణమాఫీ పూర్తయింది
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పంట రుణాల మాఫీని పూర్తి చేసిందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వడ్డీ మాఫీ కాని వారికి వెంటనే జమ చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ అడిగిన ప్రశ్నకు పోచారం సమాధానమిచ్చారు. రుణాలను, వడ్డీని ఒకేసారి మాఫీ చేశామని, ఈ ప్రక్రియ పూర్తయిపోయిందని ఆయన తెలిపారు. 

5,011 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు లబ్ధి: కడియం
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచడంతో 5,011 మంది లబ్ధి పొందారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టీఆర్‌ఎస్‌ సభ్యుడు ఎం.సుధీర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కడియం సమాధానమిచ్చారు. వాస్తవానికి కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. హైకోర్టు ఆదేశం మేరకు ఆ ప్రక్రియ ఆగిపోయిందని చెప్పారు. దాంతో ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు పెంచిందన్నారు. జూనియర్‌ కాలేజీలో పనిచేసేవారికి రూ.18 వేల నుంచి రూ.37,100కు.. డిగ్రీ కాలేజీ వారికి రూ.20,700 నుంచి రూ.40,370కి.. పాలిటెక్నిక్‌ కాలేజీలో పనిచేసే వారికి రూ.19 వేల నుంచి రూ.40,270కు పెంచామన్నారు.

దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు: తుమ్మల
కేంద్ర ప్రభుత్వ చట్టం మేరకు రాష్ట్రంలోనూ దివ్యాంగుల రిజర్వేషన్లను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు తుమ్మల సమాధానమిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నెలకు రూ.1,500 చొప్పున ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. వికలాంగుల సంక్షేమానికి రాష్ట్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో ప్రయాణించాలి: మహేందర్‌రెడ్డి
రాష్ట్రంలోని ఎంపిక చేసిన బస్టాండ్లలో 31 మినీ థియేటర్లను నిర్మించనున్నామని.. దాంతో ఆర్టీసీకి రూ.4 కోట్ల ఆదాయం సమకూరుతుందని మంత్రి మహేందర్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ఆర్టీసీకి ఆదాయం అంశంపై ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, శ్రీనివాస్‌గౌడ్, టి.జీవన్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, సున్నం రాజయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు మహేందర్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 101 పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. వాటితో రూ.40 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు.  స్పీకర్‌ మధుసూదనచారి తరహాలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకోసారి అయినా బస్సులలో తిరిగాలని మంత్రి  సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement