సౌదీ రాయబారికి జ్ఞాపికను బహూకరిస్తున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నాసిక్ తరహాలో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు తక్కువ వ్యయంతో కూడిన ‘మెట్రో నియో’ప్రాజెక్టు ప్రతిపాదనలు అనువుగా ఉంటాయని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ కోసం ఎలివేటెడ్ బస్‌ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (బీఆర్‌టీఎస్) ప్రతిపాదనల రూపకల్పనలో ‘మహా మెట్రో సంస్థ’తో కలసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
మహారాష్ట్రలోని పలు నగరాల్లో మెట్రో రైలు సదుపాయం కల్పించేందుకు పనిచేస్తున్న మహా మెట్రో సంస్థ అధికారులతో మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. మెట్రో నియో నమూనాపై అధ్యయనం చేసి, సమగ్ర ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు.
రోడ్డుపై నడిచే మెట్రో..
నాసిక్, పుణే, నాగ్‌పూర్ నగరాల్లో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలతో మహా మెట్రో అధికారులు మంత్రి కేటీఆర్ ముందు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతమున్న మెట్రోకు కొంత భిన్నంగా, అతి తక్కువ ఖర్చుతో ‘మెట్రో నియో’పేరుతో నాసిక్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు వివరాలను మంత్రికి అందజేశారు.
సంప్రదాయ మెట్రోలో రైల్వే కోచ్‌లు ఉపయోగిస్తుండగా, ప్రస్తుతం తాము ప్రతిపాదించిన మెట్రోలో ఎలక్ట్రిక్ బస్సు కోచ్‌లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్‌లతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్లపై కూడా ఈ మెట్రో నడుస్తుందన్నారు. 350– 400 మంది ఒకేసారి ప్రయాణించవచ్చన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సుమారు 25 శాతం నిధులు లభించే అవకాశముందన్నారు.
హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్: టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని భారత్‌లో సౌదీ అరేబియా రాయబారి సవూద్ బిన్ మహమ్మద్ అస్సతికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వివరించారు. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను సౌదీ రాయబారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment