సిరిసిల్ల: దేశవ్యాప్తంగా రైతులు పెట్టుబడి సాయం గురించి అడుగుతారని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, రుద్రంగి, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆదివారం లబ్ధిదారులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుబంధు పథకంపై దేశవ్యాప్తంగా ప్రకటనలు ఇస్తే.. ప్రతిపక్షాలకు భయం పట్టుకుంది.
తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరని అక్కడి రైతులు ప్రశ్నిస్తారనే భయంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు వణికిపోతున్నారు’అని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని 70 ఏళ్లుగా మీరు ఎందుకు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు డబ్బులిస్తే.. వాళ్లు తిరిగి ఎలా చెల్లించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారని, అయితే ఆ డబ్బులను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెబితే బిత్తరపోయారన్నారు.
గల్ఫ్‌లో ఉన్న రైతులకూ చెక్కులు: గల్ఫ్‌లో ఉన్న రైతులకు 17వ తేదీ తరువాత చెక్కులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. పాస్‌పోర్టు తరహాలో పట్టాదారుపాస్ బుక్కులు ఇస్తున్నామని కేటీఆర్ వివరించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరిచేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సి పనిలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో జీవీ.శ్యామ్‌ప్రసాద్‌లాల్, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment