
కుందన్‌బాగ్ క్వార్టర్స్‌లో తెలంగాణ సీఎం ఆఫీస్
కుందన్‌బాగ్ క్వార్టర్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కొలువుదీరనుంది.
- కేసీఆర్ కోరిక మేరకు ముమ్మర ఏర్పాట్లు
- ఖాళీ చేయాలని అధికారులకు ఆదేశాలు
- వాస్తు దోషం ఉందంటూ గ్రీన్‌ల్యాండ్స్‌లోని క్యాంప్ ఆఫీసు వద్దన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కుందన్‌బాగ్ క్వార్టర్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కొలువుదీరనుంది. కుందన్‌బాగ్‌లోని 3, 4వ నంబర్ క్వార్టర్లు క్యాంప్ ఆఫీసు, కేసీఆర్ నివాసంగా మారనున్నాయి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ క్వార్టర్స్‌లో ఉంటున్న అధికారులను తక్షణమే ఖాళీ చేయాలంటూ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో నంబర్ క్వార్టర్‌లో ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నివసిస్తుండగా.. నాలుగో నంబర్ క్వార్టర్‌లో పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వినీకుమార్ పరీడా ఉంటున్నారు. వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఏకే పరీడాకు కుందన్‌బాగ్ కావేరి బ్లాక్‌లోని ఫ్లాటు నెంబరు టీ7/1, మహేందర్ రెడ్డికి టీ2/4 ప్రభుత్వ క్వార్టర్లను కేటాయించారు. గ్రీన్‌ల్యాండ్స్‌లోని సీఎం క్యాంప్ ఆఫీసునే తెలంగాణ సీఎంకు కేటాయించాలని మొద ట నిర్ణయించారు. అయితే వాస్తు దోషం ఉందంటూ కేసీఆర్ దానిపై విముఖత చూపారు. కేసీఆర్ తన ఇంటినే క్యాంప్ ఆఫీసుగా వినియో గించుకోవాలని తొలు త భావించినా.. ఆ ఇల్లు చిన్నగా ఉంటుందని, పార్కింగ్‌కూ ఇబ్బందేనని అధికా రులు స్పష్టం చేశారు.
దీంతో కుందన్‌బాగ్‌లోని క్వార్టర్స్‌ను పరిశీలించి.. అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. దీంతో రెండు క్వార్టర్లను కలిపి క్యాంపు కార్యాలయంగా మార్చనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీసుగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను ప్రభుత్వం కేటాయించింది. దీన్ని చంద్రబాబు వద్దంటున్నట్టు సమాచారం. తాను ఉంటున్న ఇంటినే క్యాంపు ఆఫీసుగా వాడుకుంటానని బాబు చెబుతున్నారు.