
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరో దఫా చర్చలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు జరపనున్నారు.
ఈ సమావేశం దృష్ట్యా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశం మేరకు శాఖలవారీగా విభజన వివాదాల స్థితిగతులపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య కీలక విషయాల్లో వివాదాలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. గత ఐదేళ్లలో కొన్ని విషయాల్లో తీవ్ర వైరం కొనసాగింది. ఏపీ సీఎంగా వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టాక ఉభయ రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఏపీ, తెలంగాణల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు పర్యాయాలు చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇరువురు సీఎంలు ఉండటంతో అత్యంత సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు సాగాయి.
హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటివరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది. ఈ నెల 17న మళ్లీ రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానుండటంతో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.
17న నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవం
హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 17న ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ నివాస గృహాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి ఆర్ అండ్ బీ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహవాస్తు పూజలు నిర్వహిస్తారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ నేరుగా విజయవాడకు బయలుదేరి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment