State Division problems
-
27న విభజన సమస్యలపై సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై కేంద్ర హోం శాఖలో కదలిక వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండటంపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా తన వాణిని వినిపించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై త్వరగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ నెల 27న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో పాటు అయా అంశాలకు చెందిన కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే సమావేశం అజెండాలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన ద్వైపాక్షిక సమస్యలు, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన పన్ను రాయితీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలున్నాయి. అజెండాలోని అంశాలు ఇవీ.. ద్వైపాక్షిక సమస్యలు ► విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ► షెడ్యూల్ 10లోని రాష్ట్ర సంస్థల విభజన ► విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థల విభజన ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) విభజన ► సింగరేణి కాలరీస్, ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన ► ఉమ్మడి సంస్థల్లోని కేంద్ర ప్రాయోజిత పథకాలకు చెందిన బ్యాంకుల్లోని నగదు నిల్వలు విభజన. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల రుణాల విభజన ► బియ్యం సబ్సిడీకి సంబంధించి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ నుంచి ఏపీ పౌర సరఫరాల సంస్థకు నగదు క్రెడిట్ విడుదల ఇతర సమస్యలు ► ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక పన్ను రాయితీలు ► ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ఉమ్మడి ఏడు జిల్లాల అభివృద్ధి గ్రాంటు ► రెవెన్యూ లోటు ► పన్నుల సమస్యలు ► విద్యా సంస్థల ఏర్పాటు ► నూతన రాజధానికి కేంద్ర మద్దతు ► నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ -
ఎనిమిదేళ్లుగా వీడని చిక్కుముడులు.. త్వరగా తేల్చండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా సమస్యలు కొలిక్కి రాలేదని, వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో డిమాండ్ చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమస్యలకు పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరాలన్నారు. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల మండలి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలని గట్టిగా డిమాండ్ చేయాలని సూచించారు. కేరళలోని తిరువనంతపురంలో సెప్టెంబర్ 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల మండలి భేటీ జరగనున్న నేపథ్యంలో భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాప్యంతో మరింత నష్టం దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో రాష్ట్రం తరఫున 19 అంశాలను అజెండాలో పొందుపరచినట్లు అధికారులు వివరించారు. విభజన సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నకొద్దీ రాష్ట్రానికి మరింత నష్టం జరుగుతోందనే అంశాన్ని సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలను తక్షణమే పరిష్కరించడంపై దృష్టి సారించాల్సిందిగా సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తగినన్ని నిధులు విడుదల చేసే అంశాన్ని కూడా అజెండాలో చేర్చాలని సీఎం ఆదేశించారు. బుగ్గన నేతృత్వంలో అధికారుల బృందం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి తాను హాజరుకావడం లేదని సీఎం జగన్ తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం ఈ సమావేశానికి హాజరవుతుందని చెప్పారు. ఈ సమీక్షలో విద్యుత్, గనులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక, ప్రణాళిక, శాససనభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జీఏడీ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రణాళిక శాఖ కార్యదర్శి జి.విజయ్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్య ప్రభాకర్‌రావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎం విభజన పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యల్లో ఒకటిగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) విభాగం విభజన పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఇటీవల ఏపీ, తెలంగాణలకు పోస్టులను విభజిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర ఐపీఎం విభాగంలో 89 కేటగిరీల్లో మొత్తం 607 పోస్టులున్నాయి. వీటిని 58ః42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు విభజించారు. ఏపీకి 350, తెలంగాణాకు 257 పోస్టులు కేటాయించారు. ఏపీకి కేటాయించిన 350 పోస్టుల్లో 140 ఖాళీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య పోస్టుల విభజన చేయకపోవడంతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇబ్బందులు ఉండేవి. తాజాగా.. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఖాళీలను భర్తీచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం 2017 అక్టోబర్ నుంచి ఐపీఎం రాష్ట్ర కార్యాలయం కార్యకలాపాలు ఏపీలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో పలువురు ఉద్యోగులు తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చారు. పోస్టుల విభజన పూర్తవ్వడంతో స్థానికత ఆధారంగా సొంత రాష్ట్రాలకు ఉద్యోగులను కేటాయించారు. ఈ క్రమంలో ఏపీ నుంచి 17 మంది తెలంగాణకు వెళ్తుండగా.. ఆరుగురు తెలంగాణ నుంచి ఏపీకి రానున్నారు. త్వరలో రాష్ట్ర ల్యాబ్ అందుబాటులోకి.. ఈ నేపథ్యంలో.. త్వరలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ కార్యకలాపాలు రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలకు కలిపి హైదరాబాద్‌లో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది. దీంతో ఆహార భద్రత తనిఖీల్లో భాగంగా సీజ్ చేసిన నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపుతున్నారు. అక్కడి నుంచి నివేదికలు రావడానికి రెండు వారాల నుంచి నెలరోజుల సమయం పడుతోంది. ఫలితంగా కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యమవుతోంది. దీంతో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖపట్నంలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటును వేగవంతం చేసింది. ల్యాబొరేటరీ భవనానికి మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. నమూనాలు పరీక్షించడానికి అవసరమైన అధునాతన పరికరాలను సమకూర్చనున్నారు. వీలైనంత త్వరగా ల్యాబ్ కార్యకలాపాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె. నివాస్ తెలిపారు. -
17న తెలంగాణ, ఏపీ సీఎంల చర్చలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరో దఫా చర్చలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం దృష్ట్యా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశం మేరకు శాఖలవారీగా విభజన వివాదాల స్థితిగతులపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య కీలక విషయాల్లో వివాదాలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. గత ఐదేళ్లలో కొన్ని విషయాల్లో తీవ్ర వైరం కొనసాగింది. ఏపీ సీఎంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టాక ఉభయ రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఏపీ, తెలంగాణల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు పర్యాయాలు చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇరువురు సీఎంలు ఉండటంతో అత్యంత సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు సాగాయి. హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటివరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది. ఈ నెల 17న మళ్లీ రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానుండటంతో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. 17న నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 17న ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ నివాస గృహాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి ఆర్ అండ్ బీ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహవాస్తు పూజలు నిర్వహిస్తారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ నేరుగా విజయవాడకు బయలుదేరి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
-
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. విభజన అనంతర సమస్యలు, సచివాలయ భవనాల అప్పగింత, ఉద్యోగుల పంపకాలు, తదితర కీలక సమస్యల పరిష్కారంపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు. రెండు రాష్ట్రాల మంత్రులు గవర్నర్ సమక్షంలో బుధవారం ఉదయం సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. -
ప్రధాని పర్యటనతో ఒరిగింది శూన్యం : పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు గురించి ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సమయం సరిపోయిందని పొన్నాల అన్నారు. ఇద్దరూ కలసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు, ఉద్యోగుల విభజన, జాతీయ ప్రాజెక్టులు తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్న కేసీఆర్ ఏమీ పట్టనట్టు వ్యవహరించారన్నారు. మోదీ దళితుల గురించి ప్రస్తావించడం చూస్తుంటే హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని పొన్నాల ఎద్దేవా చేశారు.