
ప్రధాని పర్యటనతో ఒరిగింది శూన్యం : పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు గురించి ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సమయం సరిపోయిందని పొన్నాల అన్నారు. ఇద్దరూ కలసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు, ఉద్యోగుల విభజన, జాతీయ ప్రాజెక్టులు తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్న కేసీఆర్ ఏమీ పట్టనట్టు వ్యవహరించారన్నారు. మోదీ దళితుల గురించి ప్రస్తావించడం చూస్తుంటే హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని పొన్నాల ఎద్దేవా చేశారు.