
బీజేపీది బలుపు కాదు.. వాపే: పొన్నాల
బీజేపీది బలుపు కాదు వాపేనని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
సాక్షి, హైదరాబాద్: బీజేపీది బలుపు కాదు వాపేనని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రధాని కాగానే విశ్వాసం పెరిగినట్టుగా అమిత్‌షా చెప్పుకోవడం కూడా పచ్చి అబద్ధమన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అది తప్పని తేలిందన్నారు. ‘నాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీడబ్ల్యూసీ వంటి పెద్ద పదవులు వస్తున్నాయని కొందరంటున్నారు. మరికొందరు ఎమ్మెల్సీ అవుతానంటున్నారు.
ఇప్పుడున్న పీసీసీ పదవి కావాలని కోరుకుంటున్నవారే ఈ ప్రచారం చేస్తున్నారు. ఈ పదవి ఖాళీ కావాలంటే నన్ను ఏదో ఒక పదవిలోకి వారే పంపుతున్నారు. ఇంతకన్నా పెద్ద పదవే వస్తుందో, ఇక్కడే ఉంటానో.. అక్కడ (ఢిల్లీలో) ఏం జరుగుతున్నదో వీళ్లకు తెలుసా?’ అని పొన్నాల ప్రశ్నించారు. మాజీమంత్రి జె.గీతారెడ్డి పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘గీతారెడ్డి పార్టీ మారతారనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆమె సీనియర్, ముఖ్యమైన నేత.
టీఆర్‌ఎస్ వాళ్లకు మైండ్‌గేమ్ ఆడటం అలవాటు. తమ పార్టీలోకి వస్తారంటూ ప్రచారం చేస్తారు. ఇక్కడ కూడా ఇదే తీరు మైండ్‌గేమ్ ప్లాన్. కంటోన్మెంట్ ప్రచారంలో గీతారెడ్డి ఇంటిముందుకు వచ్చి చాయ్ తాగిపిస్తారా? అని మంత్రులు హరీష్‌రావు, తలసాని అడిగినారట. అలా అడిగితే కాదంటారా? . అంతేతప్ప పార్టీ మారాల్సిన అవసరం లేదని గీతారెడ్డితో మాట్లాడితే చెప్పారు. టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్‌కు అంతపెద్ద నాయకులు పడిపోరు’ అని పొన్నాల అన్నారు.
బీడీ కార్మికులకు అండగా ఉంటాం
బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఇప్పుడు దాటవేస్తున్నదని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కృష్ణ, అధ్యక్షులు వనమా కృష్ణ, నేతలు నరేందర్, కె.సూర్యం తదితరులు గాంధీభవన్‌లో పొన్నాలను శనివారం కలిసి బీడీ కార్మికుల సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉద్యమించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీగా అది తమ బాధ్యత అని, బీడీ కార్మికుల పోరాటానికి మద్ధతునిస్తామని పొన్నాల అన్నారు.