మోదీని కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నా లాభం లేదు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్యుల ఆశలు తీర్చటంలో కేంద్ర బడ్జెట్ విఫలమయిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులు, పేదలు, సామాన్యులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమిటని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో రైతు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయే తప్ప ఆదాయం ఏమాత్రం పెరగలేదని విమర్శించారు.
నోట్ల రద్దును సమర్ధిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకున్నా, కేంద్రం మాత్రం బడ్జెట్ లో తెలంగాణను విస్మరించిందని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించలేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.