నరేంద్ర మోడీ, కేసీఆర్లకు పొన్నాల లేఖాస్త్రాలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్కు శనివారం టి.పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వేర్వేరుగా లేఖాస్త్రాలు సంధించారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చవద్దని మోడీకి రాసిన లేఖలో పొన్నాల కోరారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఇప్పటికే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ పేరు మార్చి టీడీపీ వ్యవస్థాప అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు పెడితే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తె ప్రమాదం ఉందని సూచించారు.ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మించే విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మోడీకి రాసిన లేఖలో పొన్నాల స్పష్టం చేశారు.
కేసీఆర్కు లేఖ:
హుస్సేన్ సాగర తీరంలోని ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని టీ.పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్కు పొన్నాల లేఖ రాశారు. కాళోజి నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ: జయశంకర్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, శ్రీకాంతచారి తదితర తెలంగాణ ప్రముఖులు విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఆ విగ్రహాల ఏర్పాటులో సాంకేతిక సమస్యలు ఎదురైన పక్షంలో.... కాంగ్రెస్ పార్టీ తరపున విగ్రహాలు ఏర్పాటు చేసే తమకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో పొన్నాల విజ్ఞప్తి చేశారు.