సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా సమస్యలు కొలిక్కి రాలేదని, వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో డిమాండ్ చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమస్యలకు పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరాలన్నారు. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల మండలి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలని గట్టిగా డిమాండ్ చేయాలని సూచించారు. కేరళలోని తిరువనంతపురంలో సెప్టెంబర్ 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల మండలి భేటీ జరగనున్న నేపథ్యంలో భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జాప్యంతో మరింత నష్టం
దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో రాష్ట్రం తరఫున 19 అంశాలను అజెండాలో పొందుపరచినట్లు అధికారులు వివరించారు. విభజన సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నకొద్దీ రాష్ట్రానికి మరింత నష్టం జరుగుతోందనే అంశాన్ని సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలను తక్షణమే పరిష్కరించడంపై దృష్టి సారించాల్సిందిగా సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తగినన్ని నిధులు విడుదల చేసే అంశాన్ని కూడా అజెండాలో చేర్చాలని సీఎం ఆదేశించారు.
బుగ్గన నేతృత్వంలో అధికారుల బృందం
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి తాను హాజరుకావడం లేదని సీఎం జగన్ తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం ఈ సమావేశానికి హాజరవుతుందని చెప్పారు.
ఈ సమీక్షలో విద్యుత్, గనులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక, ప్రణాళిక, శాససనభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జీఏడీ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రణాళిక శాఖ కార్యదర్శి జి.విజయ్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్య ప్రభాకర్‌రావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment