సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏడాదిన్నర కింద మొదలైన అటవీ భూముల వివాదం రాజుకుంటోంది. నీటిపారుదల శాఖకు రెవెన్యూ శాఖ కేటాయించిన భూములు తమవంటూ అటవీ శాఖ అడ్డు పడుతుండటంతో వివాదం మొదటి కొచ్చింది. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా నాగర్‌కర్నూల్ జాయింట్ కలెక్టర్, ప్రాజెక్టు ఎస్‌ఈ సభ్యులుగా, నాగర్‌కర్నూల్ డీఎఫ్‌ఓ మెంబర్ సెక్రటరీగా కమిటీని ఏర్పాటు చేస్తూ నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ వివాదం..
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా 1వ ప్యాకేజీలో నార్లాపూర్ వద్ద స్టేజ్–1 పంపింగ్ స్టేషన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన 114 ఎకరాల భూమిని తమ భూమిగా పేర్కొంటూ నీటి పారుదల శాఖకు అప్పగించింది. దీంతో నీటి పారుదల శాఖ నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే ఎలాంటి అనుమతుల్లేకుండానే అటవీ స్థలంలో పనులు ప్రారంభించారని పేర్కొంటూ నీటి పారుదల శాఖకు అటవీ శాఖ ఘాటైన లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిన నీటి పారుదల శాఖ.. అండర్ గ్రౌండ్ పంప్‌హౌజ్ నిర్మాణం చేపట్టింది. అయితే ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న భూమిలో నుంచి 8 ఎకరాలు ఈ పనులకు అవసరం పడుతోంది. ఇటీవల ఇదే అంశమై అటవీ శాఖ అడ్వైజరీ కమిటీ ముందు ప్రాజెక్టు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 114 ఎకరాల భూమిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయితే 1970వ దశకంలో ఈ భూములకు సంబంధించి అటవీ శాఖ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిందని, తదనంతరం రెవెన్యూ, గ్రామాల పరిధిలోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకోలేదని, ఫైనల్‌గా నోటిఫై చేయలేదని రెవెన్యూ శాఖ వాదించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రాజెక్టుకు కమిటీ అనుమతి చ్చింది. అయినా ఈ భూముల అంశం తేల్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Published Wed, Sep 27 2017 3:02 AM | Last Updated on Wed, Sep 27 2017 3:02 AM
Advertisement