మహబూబ్‌నగర్ పట్టణ వ్యూ
రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి మరింత ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఏడేళ్లుగా భూములు, పాట్ల మార్కెట్ విలువను పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరించిన ప్రభుత్వం, ప్రస్తుతం భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఎంతమేరకు పెంచవచ్చనే విషయమై ప్రతిపాదనలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూములు, ప్లాట్లకు మార్కెట్ విలువ అత్యధికంగా పెరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు ఎక్కువగా అయ్యే ప్రాంతాల్లో మార్కెట్ విలువను అమాంతం పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. మిగతా ప్రాంతాల్లో 50 నుంచి వందశాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా పరిధిలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఇక్కడ 60 నుంచి 100శాతం పెరగవచ్చునని ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందనే సమాచారంలేదని వనపర్తి సబ్ రిజిస్ట్రార్ ఖుషియా బదర్ తెలిపారు.
ఏడేళ్ల తర్వాత తెరపైకి మార్కెట్ విలువ అంశం
మార్కెట్ విలువ పెంచే విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏడేళ్ల తర్వాత తెరపైకి తీసుకువచ్చింది. నిబంధనల ప్రకారం.. ప్రతి రెండేళ్లకు ఒకసారి భూములు, ప్లాట్ల విలువను పెంచాల్సి ఉంది. ఆయా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి ఇదివరకు రెండుసార్లు ప్రతిపాదనలు పంపించినా మార్కెట్ విలువ పెంచలేదు. నెలరోజుల నుంచి ప్రభుతం ఈ విషయంపై క్షేత్రస్థాయి అధికారులతో ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం, తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచే పెంచాలనుకుంది. కానీ కొన్నిమార్పులు చేయాలనే ఉద్దేశంతో మరికొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అన్నిరకాల భూములకు ఒకే మార్కెట్ విలువ?
ఇదివరకే తరి, మెట్ట భూములకు వేర్వేరు మార్కెట్ విలువ ఉండేది. ప్రస్తుతం పెంచే మార్కెట్ విలువరేట్లలో అన్నిరకాల భూములకు, ప్లాట్లకు ఒకే రకమైన మార్కెట్ విలువను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు చెప్పారు.
వనపర్తి రెండింతలు..
మహబూబ్‌నగర్, జడ్చర్ల తర్వాత అత్యధికంగా వనపర్తి జిల్లాలోనే మార్కెట్ విలువను పెంచేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
మార్కెట్ విలువను బట్టి స్టాంప్ డ్యూటీ
ప్రతి రిజిస్టేషన్‌కు మార్కెట్ విలువను బట్టి కొ నుగోలుదారులు రూ.లక్షకు రూ.6వేల చొప్పు న ప్రభుత్వానికి స్టాంప్‌డ్యూటీ పేర చెల్లించాల్సి ఉంటుంది. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల నుంచి ఏటా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరగనున్న మార్కెట్ విలువతో రెట్టింపు కానుంది.
ఫిబ్రవరి 1న పెంచుతామన్నారు
ఇప్పటికే మార్కెట్ విలువను పెంచేందుకు పలుమార్లు ఉన్నతాధికారులు సమావేశాలు ఏర్పాటు చేశారు. మాతో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఏయే ప్రాంతంలో ఎంత మేరకు పెంచాలనే అంశంపై ఇదివరకు ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్‌లతో ప్రతిపాదనలు తీసుకునేది. కానీ ప్రస్తుతం ఉన్నతాధికారులు, ప్రభుత్వం జిల్లా రిజిస్ట్రార్‌లతో ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నారు.
– ఖుషియా బదర్, సబ్‌రిజిస్ట్రార్, వనపర్తి
స్పష్టత లేదు..
మార్కెట్ విలువపై సమావేశాలు నిర్వహించారు. ప్రతిపాదనలు అడిగారు. పెంచిన మార్కెట్ విలువ రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి చేయాలనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టతరాలేదు.
– రవీందర్, జిల్లా రిజిస్ట్రార్, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment