సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ మహమ్మారిలా విజృంభించింది. మూడు నాలుగు నెలలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. సీజన్ దాటినా ఇప్పటికీ డెంగీ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. డెంగీ అనుమానంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి డెంగీ ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా ప్రభుత్వానికి ఆ శాఖ అధికారులు ఒక నివేదిక అందజేశారు. దాని ప్రకారం రాష్ట్రంలో 40,434 మంది రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 10,237 మంది కి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని తెలిపారు. మరణాలు మాత్రం రెండే సంభవించినట్లు పేర్కొన్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 20 వేల మంది వరకు డెంగీకి గురయ్యారని, 150 మందికిపైగా చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ లోని కొందరు చెబుతున్నారు. డెంగీ కేసుల సంఖ్యను, మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సర్కారు నివేది క ప్రకారం అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 2,709 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 1,847 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 713 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, ఖమ్మం జిల్లాలో ఒకరు చనిపోయారని నివేదిక తెలిపింది.
ఆగని జ్వరాలు.. ఆదుకోని యంత్రాంగం
రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర విష జ్వరాలతో వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సరాసరి ప్రతీ ఇంట్లోనూ ఒకరు వైరల్ జ్వరాల బారినపడినట్లు వైద్య ఆరోగ్య వర్గాలే అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు సరిపోక నేలపైన పడుకోబెడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఒక్కోసారి ఐసీయూ లు నిండి సాధారణ వార్డుల్లో ఉంచుతున్నారు. ఇటువంటి పరిస్థితి నెలకొంటున్నా వైద్య ఆరోగ్యశాఖ పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నా యి. ఒక కీలక అధికారి జ్వరంతో సెలవు పెట్టగా, మరికొందరు టూర్ల పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిరావడం విమర్శలకు తావిస్తోంది. మంచిర్యాల జిల్లాలో నలుగురు చనిపోయినా అధికారులు కనీసం అక్కడకు వెళ్లి పరిస్థితిని అంచనా వేయకపోవడంపైనా విమర్శలొస్తున్నాయి. ఇటు జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో సాయం త్రం ఓపీ చూడాలన్న నిర్ణయాన్ని అనేకచోట్ల అమలు చేయడం లేదు. మరోవైపు జిల్లాలకు సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లను సరఫరా చేయడంలోనూ వైఫల్యం కనిపిస్తుంది.
మంచిర్యాలలో యువతి మృతి
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని బీజోన్‌కు చెందిన కల్వల స్నేహ (23) అనే యువతి ఆదివారం డెంగీతో మరణించింది. ఆమె 10 రోజుల క్రితం జ్వరంతో మంచిర్యాల ఆస్పత్రిలో చేరగా ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి వచ్చింది. 4 రోజుల అనంతరం డిశ్చార్జి చేశారు. మళ్లీ రెండ్రోజుల్లో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కరీంనగర్‌కి తీసుకెళ్లగా పరిస్థితి చేజారింది. స్నేహ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
డెంగీ మరణాలపై కమిటీ తర్జనభర్జన
రాష్ట్రంలో డెంగీ మరణాల సంఖ్యను తేల్చడంలో అందుకు ఏర్పాటైన కమిటీ తర్జన భర్జన పడుతోంది. రాష్ట్రంలో డెంగీ మరణాలపై నెలన్నర కిందట ప్రభుత్వం ఆడిట్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జిల్లాల నుంచి డెంగీ మరణాల సంఖ్యను, కేసుల వివరాలను తెప్పించుకున్న ఆ కమిటీ మంగళవారం సమావేశమైంది. అనుమానిత డెంగీ మరణాలపై ఆరా తీసింది. మరోవైపు బుధవారం జిల్లాల డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనుమానిత డెంగీ మరణాలపై విచారించాలని నిర్ణయించింది.
అధిక ఫీజులు వసూలు...
ఈ సీజన్‌లో అనేకమంది ఆసుపత్రులకే వేలు లక్షలు ధారపోశారు. డెంగీ, చికున్‌గున్యాల అనుమానంతో అనేకమంది ఆసుపత్రుల్లో చేరారు. అవసరమున్నా లేకున్నా జ్వరంతో వచ్చే వారికి వైద్య పరీక్షలు చేయడంపై ఆరోపణలొచ్చాయి. ఇక డెంగీతో బాధపడే వారి నుంచి ప్లేట్‌లెట్ల పేరుతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు భారీగానే డబ్బులు దండుకున్నాయి. మామూలుగా 20 వేల వరకు ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలుంటే 50 వేల వరకు ప్లేట్‌లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే అనేక ప్రైవేటు ఆసుపత్రులు 50 వేలకు పైగా ప్లేట్‌లెట్లున్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలా నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల సంగతి సరేసరి. పెద్ద సంఖ్యలో రోగులు వస్తుండటం, వైద్య పరీక్షలకే రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడం, తగిన మందులు అందుబాటులో లేకపోవడంతో ఇక తప్పదంటూ రోగులు ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు.
లక్ష ఖర్చు..
–ఇమ్మడి రాజ్యలక్ష్మి, సుబేదారి, హన్మకొండ
డెంగీతో నెల క్రితం హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చేరాను. ప్లేట్‌లెట్ల సం ఖ్య 30 వేలకు తగ్గడం తో వైద్యులు హైదరాబాద్ తరలించారు. అప్పటికే ఆ ఆస్పత్రిలో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నాం. రూ.లక్ష ఖర్చు చేస్తే కానీ ఆరోగ్యం బాగుపడలేదు.
మా ఇంట్లో ముగ్గురికి డెంగీ
– వెంకన్న, గార్ల, మహబూబాబాద్ జిల్లా
మా ఇంట్లో నాకు, నా భార్య మొగిలి రేణుక, కూతురు దివ్యకు డెంగీ వచ్చింది. గార్ల ఆసుపత్రిలో జ్వరం తగ్గేందుకు రూ.25 వేలు ఖర్చు చేశాను. అయినా ప్లేట్‌లెట్లు పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాం. ఖమ్మం ఆసుపత్రిలో రూ.75 వేలు వైద్యం కోసం ఖర్చుపెట్టా. జ్వరాలకే రూ.లక్ష వరకు అప్పులయ్యాయి. ప్రస్తుతం కోలుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment