సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ మళ్లీ కొనసాగుతారా? ప్రస్తుత రాజ కీయ పరిస్థితుల్లో ఆయనను మార్చి కొత్త నేతను నియమించడం ద్వారా అదనపు ప్రయోజనమేమీ ఉండబోదని, బీసీ వర్గానికి చెందిన ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగించడం మంచిదనే అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చిందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి లక్ష్మణ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి మూడేళ్లు దాటడంతో పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష బాధ్యతల్లో మార్పు చేయాలి. అయితే మరో సారి ఆయనకే చాన్సివ్వాలని, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రేసులో ఉన్నా.. ఆయన వైపే మొగ్గు
రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌కు వారసులు ఎవరనే దానిపై రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా దీనిపై లోతుగానే పరిశీలిస్తోంది. ఈ జాబితాలో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన డీకే అరుణ, ఎంపీ బండి సంజయ్, సీనియర్ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, యెండెల లక్ష్మీనారాయణ తదితరుల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. మరోవైపు తనకు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ పని చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అంటున్నారు.
ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ను మారిస్తే డీకే అరుణ లేదా మురళీధర్‌రావును నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణలు, రాజకీయ నేపథ్యం, పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో లక్ష్మణ్ వ్యవహరించిన తీరు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఆయననే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను గెలిపించుకోవడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అటు విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇటు ఆర్టీసీ కార్మికులకు తోడు ఉండి పోరాటం చేయడం, ఆయన హయాంలోనే అనేక మంది నేతలు పార్టీలో చేరడం, జాతీయ నాయకత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండటం లాంటి అంశాలు ఆయనకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తానే ఓడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
మరో నేత డీకే అరుణ పేరును కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్‌గానే పరిగణించారు. మాజీ మంత్రిగా పనిచేసిన ఆమె.. కేసీఆర్‌ను గట్టిగా ఎదుర్కోగలరని, మహిళా నేత గా బలమైన సామాజిక వర్గానికి చెంది ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండటం, సొంతంగా కేడర్‌ను అభివృద్ధి చేసుకునే రాజకీయ చతురత తదితరల అంశాలను కూడా పార్టీ పరిశీలించింది. కానీ కాంగ్రెస్ నుంచి వచ్చి కొం తకాలమే కావడం ఆమెకు మైనస్‌గా మారిందనే చర్చ జరుగుతోంది. ఆమెను అధ్యక్షురాలిని చేస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పగ్గాలిచ్చారనే విమర్శ వస్తుందని యోచిస్తున్నట్లు తెలిసింది. మురళీధర్‌రావు ఎక్కడా తనంతట తాను అధ్యక్ష పదవి అడక్కపోయినా ఆయనకు కూడా బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరిగింది. జాతీ యస్థాయిలో మంచి గుర్తింపు ఉన్న ఆయనను ఓ రాష్ట్రానికి పరిమితం చేయడం సరైంది కాదని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఫిబ్రవరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment