విరామం విహారం
కాస్త ముందుగానే ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఈ నెలలో అయినా వేసవి సెలవులు ఆస్వాదించే అవకాశం భానుడు కల్పిస్తే సద్వినియోగం చేసుకోవాల్సిందే. రొటీన్ మూడ్ నుంచి బయటపడటానికి టూర్ వేసేయాల్సిందే....ఇలా అనుకుంటుంటే మీ వీకెండ్ టూర్ లిస్ట్‌లో చేర్చాల్సిన మరో డెస్టినేషన్ కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా. - హన్మకొండ కల్చరల్
చరిత్రకు సాక్ష్యం...
రత్నగర్భగా పేరొందిన ఈ కోట కాకతీయుల కాలంలో సైనిక స్థావరంగా ఉండేది. కాకతీయులు, బహుమనీ సుల్తానులు, కులీ కుతుబ్‌షాహీలు దీనిని పాలించిన దాఖలాలున్నాయి. దీని గురించి పురాణాల్లో సైతం ప్రస్తావించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. రామయణ మహాకావ్యంలో, కాళిదాసు మేఘసందేశంలోనూ దీని ప్రస్తావన ఉందంటారు. 4 ప్రవేశ ద్వారాలు, 4 కోట గోడలతో నిర్మించిన పటిష్టమైన ఈ దుర్గంలో 3 ప్రాకారాలు ఇప్పటికీ చూడొచ్చు. కొండ మీద ఉన్న ఈ కోటకు చేరుకోవడానికి కష్టపడాల్సిందే. ట్రెక్కింగ్ చేస్తూ పైకి ఎక్కి చూస్తే మానేరు, గోదావరిలో కలిసే అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. కనుచూపు మేర రమ్యమైన పరిసరాలు... కోట వైభవాన్ని లీలగా గుర్తు చేస్తూ నాటి వైభవం సాక్షిగా నేడో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది.
సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారనే నమ్మకం తో భక్తులు ఈ ప్రదేశానికి వస్తుంటా రు. రాముడు ప్రతిష్టించిన లింగం, శ్రీసీతారాముల పాద ముద్రలుగా చెప్పే అడుగుల ముద్రలు కోట ఆవరణలో కనిపిస్తాయి. సీతమ్మ కొలను, రామపాదాలు, సీతారాముల ఆల యం, చిన్న జలపాతం.. ఇలా ఈ కోటలో విశేషాలెన్నో. అక్కడ మిగిలి ఉన్న అవశేషాలను బట్టి కొన్ని భవనా లు, బురుజులు, మసీదులు, సమాధు లు, ప్రతాపరుద్రుని కోట, అశ్వగజశాలలుగా పోల్చుకోవచ్చు. జైలు, భోజనశాల, రహస్యమార్గాలు, ఫిరంగులు కూడా కనిపిస్తాయి. ఈ కోటలో తోపుబావి, నల్లకయ్యబావి, పసరుబావి, హరిబావి, అచ్చమ్మబావి, అమ్మగారిబావి ఇలా అనేక బావులు, కొలనుల నెలవు ఈ ప్రదేశం. అనేక బురుజులు, ఆలయాలు, ప్రవేశద్వారాలున్న ఈ రామగిరి కోటకు టూరిస్టులు మాత్రమే కాకుండా స్థానికులు కూడా తరచూ పిక్నిక్‌కి వస్తుంటారు.
వన మూలికల వేదిక
ఆయుర్వేద వన మూలికలకు నిలయంగా ఈ ప్రదేశానికి పేరు. అందుకే టూరిస్టులు, స్థానికులు, సాహసికులే కాదు ఆయుర్వేద వైద్యులు, బోటనీ విద్యార్థులు కూడా తరచూ సందర్శిస్తుంటారు. అయితే చీకట్లో ఈ ప్రాంతానికి వెళ్లటం శ్రేయస్కరం కాదు. హైదరాబాద్‌కు 215 కి.మీ దూరంలో ఉందీ ఖిల్లా. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, మంథని దారిలో బేగంపేట గ్రామ పరిసరాల్లో ఈ కోట ఉంది.